తెలంగాణ- ఛత్తీస్ఘడ్ సరిహద్దులో మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్-ఛత్తీస్‌ఘడ్ సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్లో హిడ్మా ఎన్‌కౌంటర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా ఎల్మాగూడ- బీజాపూర్ జిల్లా ఎగువసెంబి మధ్య ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్లో... పలువురు మావోలతో పాటు హిడ్మా హతమయ్యాడన్నది పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ కోసం పోలీసులు హెలికాప్టర్ వాడినట్టు స్థానికులు కొందరు చెబుతున్నారు. 50లక్షల రివార్డు ఉన్న హిడ్మాను నాలుగు రాష్ట్రాల పోలీసులు గత రెండు దశాబ్దాలుగా వెతుకుతున్నారు.
చేతిలో నెంబర్ వన్ బెటాలియన్
దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది.
టార్గెట్ 100%
2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు.
చదవండి: (తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?)
హింస vs సిద్ధాంతం
చాలాకాలం పాటు పోలీసులకు ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు.
కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా?
పార్టీ పుట్టుక నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీలో ఒక్క గోండు కూడా లేడు. ఛత్తీస్‌ఘడ్‌లో ప్రస్తుతం 80శాతం మావోయిస్టులు గోండు తెగకు చెందిన గిరిజనులే. అయితే వీరికి నాయకత్వం ఇవ్వడంతో పార్టీలో పెద్ద చర్చ జరిగింది. వీరిలో చాలామందికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదని కొందరు విమర్శించారు. కేవలం చంపడంపైనే శిక్షణ పొందిన వీరు పార్టీని నడపలేరని చెబుతారు. ఇలాంటి సందర్భంలోనే హిడ్మా కేంద్ర కమిటీలోకి రావడం వల్ల... ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో స్థానిక గిరిజనులు నాయకత్వం తీసుకోడానికి ఒక అవకాశంగా మారింది.
నమ్మకం వమ్మయిందా?
హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్టు పార్టీలో ఒక గుడ్డి నమ్మకం ఉంది. ఇప్పుడు హిడ్మా చనిపోతే అది క్యాడర్‌కు కూడా నైతికంగా ఎదురు దెబ్బేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా... ఎన్‌కౌంటర్లో ఎలా చనిపోతారనే చర్చ జరుగుతోంది. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే హిడ్మా బ్రతికే ఉన్నాడని తర్వాత తేలింది. ప్రస్తుత హిడ్మా ఎన్కౌంటర్‌పై ఇప్పటివరకు తెలంగాణ -ఛత్తీస్గడ్ పోలీసులు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అటు మావోయిస్టు పార్టీ కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.
- ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment