మా పార్టీ అయినా అంతే!  | MLC kavitha on not providing womens reservation | Sakshi
Sakshi News home page

మా పార్టీ అయినా అంతే! 

Published Thu, Mar 16 2023 1:35 AM | Last Updated on Thu, Mar 16 2023 8:06 AM

MLC kavitha on not providing womens reservation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మా పార్టీ సహా ఏ పార్టీ రాజ్యాంగంలోనూ మహిళలకు 50శాతం గానీ, లేదా ఇన్ని సీట్లు అనే ప్రస్తావనగానీ లేకపోవటమే అసలు సమస్య..’’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా మహిళలకు సీట్లు కేటాయించడమనేదీ ఏ పార్టీలోనూ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పి స్తూ చట్టం చేస్తేనే అన్ని రాజకీయ పార్టీలు దారికొస్తాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశంపై భారత్‌ జాగృతి నేతృత్వంతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా 13 పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ‘‘రాజకీయ పార్టీల రాజ్యాంగాల్లో మహిళలకు 50% లేదా ఇన్ని సీట్లు అనే ప్రస్తావన ఉందా? మీ పార్టీ రాజ్యాంగంలో ఆ విధంగా ఏమైనా పొందుపరిచారా?’’అని అభిమన్యుసింగ్‌ అనే జర్నలిజం విద్యార్థి ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ‘‘మా పార్టీ సహా ఏ పార్టీ రాజ్యాంగంలో కూడా మహిళలకు ఇన్ని సీట్లు కేటాయించాలని లేకపోవటమే అసలు సమస్య.

కొన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతీ పార్టీలోనూ, ఎన్నికల్లోనూ మహిళలకు తగినన్ని సీట్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా పూనుకుంటేనే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది’’అని పేర్కొన్నారు. 

ఇది నా పూర్వజన్మ సుకృతం 
రౌండ్‌ టేబుల్‌ సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్లమెంట్‌ లోపల, బయట ఒత్తిడి పెంచేందుకే ఎంపీలతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు డ్రాఫ్ట్‌తోపాటు పార్లమెంట్‌లో ఎంపీలు ఎలాంటి ప్రశ్నలు అడిగి మహిళా బిల్లును సాధించేందుకు ముందుకు వెళ్లొచ్చనే మెటీరియల్‌ను భారత్‌ జాగృతి తరఫున తయారు చేసి ఇచ్చామన్నారు. త్వరలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదానిపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులతో చర్చించామని కవిత తెలిపారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించడంతోపాటు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టడం, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనల ద్వారా మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశంపై పోరాటాన్ని కొనసాగిస్తారని వెల్లడించారు. 

అందరినీ కలుపుకొని వెళతాం 
బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ మహిళలకు ఇచ్చి న మాటను నిలబెట్టుకోవాలని.. దేశ మహిళలను మోసం చేయవద్దని కవిత విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ, టీడీపీలను భారత్‌ జాగృతి చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఆహ్వానించ లేదని.. త్వరలో వారిని కూడా కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీని రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆహ్వానించినా.. తమతో కలిసి పోరాటం చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతో కాంగ్రెస్‌ ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement