Central Pollution Control Board: నిర్భయంగా శ్వాసించండి! | National Clean Air Programme: 95 Of 131 NCAP Cities Have Better Air Quality | Sakshi
Sakshi News home page

Central Pollution Control Board: నిర్భయంగా శ్వాసించండి!

Published Mon, Sep 9 2024 4:54 AM | Last Updated on Mon, Sep 9 2024 4:54 AM

National Clean Air Programme: 95 Of 131 NCAP Cities Have Better Air Quality

పలు నగరాల్లో బాగా మెరుగవుతున్న గాలి నాణ్యత   

ఎన్‌సీఏపీ పరిధిలోని 95 శాతం నగరాల్లో సత్ఫలితాలు: కేంద్రం

జాబితాలో హైదరాబాద్, రాజమండ్రి, కర్నూలు, కడప, నల్లగొండతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తెలియజేసింది. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం(ఎన్‌సీఏపీ) పరిధిలో 131 నగరాలుండగా, వీటిలో 95 శాతం నగరాల్లో గాలి నాణ్యత మెరుగైనట్లు వెల్లడించింది. 2017–18 నాటి ‘పీఎం10’ స్థాయిలతో పోలిస్తే ఇప్పుడు 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీపీసీబీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.  

→ ఎన్‌సీఏపీ పరిధిలోని 131 నగరాలను గాను కేవలం 18 నగరాల్లో గాలి నాణ్యత ప్రమాణాల మేరకు నమోదైంది. ఎన్‌ఏఏక్యూఎస్‌ ప్రకారం ‘పీఎం10’ ధూళి కణాలుక్యూబిక్‌ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల్లోపు ఉండాలి.  
→ కడప, వారణాసి, ధన్‌బాద్, డెహ్రాడూన్, ట్యుటికోరిన్, మొరాదాబాద్, కోహిమా, లక్నో, కాన్పూర్, ఆగ్రా, గ్రేటర్‌ ముంబై తదితర 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గాయి.  
→ విజయవాడ, అహ్మదాబాద్, ఘజియాబాద్, రాజ్‌కోట్, రాయ్‌బరేలీ, కోల్‌కతా, జమ్మూ, సిల్చార్, దిమాపూర్, జోద్‌పూర్‌ తదితర 14 నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 నుంచి 40 శాతం తగ్గిపోయాయి.  
→ హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, దుర్గాపూర్, డేరాబాబా నానక్, వడోదర, అలహాబాద్, అసన్‌సోన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరు, అకోలా, సూరత్, నోయిడా తదితర నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 శాతం దాకా పడిపోయాయి.  
→ రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అమరావతి, ఢిల్లీ, హౌరా, థానే, లాతూర్, అల్వార్, మండీ గోవింద్‌గఢ్, పటియాలా, జైపూర్, చంద్రపూర్, నాసిక్, ఝాన్సీ, సాంగ్లీ తదితర 21 నరగాల్లో పీఎం10 స్థాయిలు 10 నుంచి 20 శాతం తగ్గిపోయాయి.  
→ గాలిలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాన్ని 2024 నాటికి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో ఎన్‌సీఏపీ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. 2017 నాటి కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.  
→ 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో సూరత్, జబల్పూర్‌ టాప్‌లో ఉన్నాయి.  
→ 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో ఫిరోజాబాద్‌(ఉత్తరప్రదేశ్‌), అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్‌) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.  
→ 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్‌బరేలీ(యూపీ), నల్లగొండ (తెలంగాణ) టాప్‌ ర్యాంకులు సాధించాయి.
→ వాయు నాణ్యతను మెరుగుపర్చడంలో ప్రతిభ చూపిన నగరాలకు కేంద్ర పర్యావరణ శాఖ శనివారం జైపూర్‌లో ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ సిటీ అవార్డులు’ ఇచ్చింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement