clean air
-
Central Pollution Control Board: నిర్భయంగా శ్వాసించండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తెలియజేసింది. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం(ఎన్సీఏపీ) పరిధిలో 131 నగరాలుండగా, వీటిలో 95 శాతం నగరాల్లో గాలి నాణ్యత మెరుగైనట్లు వెల్లడించింది. 2017–18 నాటి ‘పీఎం10’ స్థాయిలతో పోలిస్తే ఇప్పుడు 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీపీసీబీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. → ఎన్సీఏపీ పరిధిలోని 131 నగరాలను గాను కేవలం 18 నగరాల్లో గాలి నాణ్యత ప్రమాణాల మేరకు నమోదైంది. ఎన్ఏఏక్యూఎస్ ప్రకారం ‘పీఎం10’ ధూళి కణాలుక్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల్లోపు ఉండాలి. → కడప, వారణాసి, ధన్‌బాద్, డెహ్రాడూన్, ట్యుటికోరిన్, మొరాదాబాద్, కోహిమా, లక్నో, కాన్పూర్, ఆగ్రా, గ్రేటర్ ముంబై తదితర 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గాయి. → విజయవాడ, అహ్మదాబాద్, ఘజియాబాద్, రాజ్‌కోట్, రాయ్‌బరేలీ, కోల్‌కతా, జమ్మూ, సిల్చార్, దిమాపూర్, జోద్పూర్ తదితర 14 నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 నుంచి 40 శాతం తగ్గిపోయాయి. → హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, దుర్గాపూర్, డేరాబాబా నానక్, వడోదర, అలహాబాద్, అసన్‌సోన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరు, అకోలా, సూరత్, నోయిడా తదితర నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 శాతం దాకా పడిపోయాయి. → రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అమరావతి, ఢిల్లీ, హౌరా, థానే, లాతూర్, అల్వార్, మండీ గోవింద్గఢ్, పటియాలా, జైపూర్, చంద్రపూర్, నాసిక్, ఝాన్సీ, సాంగ్లీ తదితర 21 నరగాల్లో పీఎం10 స్థాయిలు 10 నుంచి 20 శాతం తగ్గిపోయాయి. → గాలిలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాన్ని 2024 నాటికి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో ఎన్సీఏపీ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. 2017 నాటి కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. → 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో సూరత్, జబల్పూర్ టాప్‌లో ఉన్నాయి. → 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్), అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. → 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్‌బరేలీ(యూపీ), నల్లగొండ (తెలంగాణ) టాప్ ర్యాంకులు సాధించాయి.→ వాయు నాణ్యతను మెరుగుపర్చడంలో ప్రతిభ చూపిన నగరాలకు కేంద్ర పర్యావరణ శాఖ శనివారం జైపూర్‌లో ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డులు’ ఇచ్చింది. -
జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ఇది మామూలు పిట్టబొమ్మ కాదు. చాలా స్మార్ట్ పిట్టబొమ్మ. దీనిని గోడకు అలంకరణలా వేలాడదీసుకుంటే చాలు. ఇంట్లోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గాలిని శుభ్రపరుస్తుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే వాసనలను, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వాసనలను, గాలిలోని దుమ్ము ధూళి కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి చేరితే, దీని యాప్ ద్వారా వెంటనే కిటికీలు తెరవాలంటూ సందేశం పంపుతుంది. ‘బర్డీ’ అనే డానిష్ కంపెనీ, ఇదే బ్రాండ్ పేరుతో ఈ పిట్టబొమ్మను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హైటెక్ పిట్ట ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండేవారికి అలెర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,616) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
ఊపిరితిత్తులను ఇలా కాపాడుకుందా..!
ఊపిరితిత్తులు ఎప్పుడూ శ్వాసిస్తూ ఉంటాయి. కాబట్టి బయటి నుంచి కాలుష్యాలూ కరోనా వైరస్సులూ కలగలిసి దెబ్బతీసే అవకాశాలు ఎక్కువే. అయితే వాటి రక్షణ కోసం ఏర్పటైన వ్యవస్థ మన దేహంలోనే ఉంటుంది. ముక్కునుంచే మొదలయ్యే రక్షణ... శ్వాసం కోసం తీసుకునే గాలి ప్రవేశించే ప్రవేశద్వారమైన ముక్కు నుంచి రక్షణ వ్యవస్థ మొదలైపోతుంది. ముక్కులో ఉండే వెంట్రుకలు పెద్ద కాలుష్యపు కణాలను (పార్టికల్స్‌ను) చాలావరకు అక్కడే కట్టడి చేస్తాయి. దానికి తోడు ముక్కు ఓ ఎయిర్కండిషనర్లా కూడా పనిచేస్తూ ఊపిరితిత్తులకు రక్షణ కలిగిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బయటి గాలిని ముక్కు ఒకింత చల్లబరిచాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా జాగ్రత్త తీసుకుంటుంది. అలాగే వాతావరణం బాగా చల్లబడే ఈ సీజన్లో ఆ చలిగాలి ప్రవేశించకుండా, దాంతో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు బాగా సంకోచించుకుని పోకుండా అదే ముక్కు జాగ్రత్తపడుతుంది. ఈ సీజన్లో చలిగాలిని కాసింత వేడిగా మారాకే ముక్కు గాలిని లోనికి పంపుతుంది. ఇలా మన ముక్కు ఊపిరితిత్తులకు దాదాపుగా ఒకేలాంటి ఉష్ణోగ్రత ఉన్న గాలిని అందజేస్తుంది. నిర్మాణమే అద్భుతం... ముక్కు చివరన ఉండే వాయునాళం (ట్రాకియా) మొదటి అంతస్తు అనుకుంటే ఊపిరితిత్తుల చివరి అంచెలో ఉండే ఆల్వియోలస్ అనే గాలిగదిది చివరి అంతస్తు. ఇలా మన శ్వాస వ్యవస్థలో 28 అంతస్తులుంటాయి. లంగ్స్‌కు ప్రతిరోజూ 16 వేల లీటర్ల గాలి అందుతున్నప్పుడు... కేవలం ఒక కిలో కంటే కాస్తంత ఎక్కువ బరువు ఉండే ఊపిరితిత్తుల్లో ఇంత పెద్దమొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఎయిర్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చివరి అంతస్తు అయిన ఆల్వియోలైలో అతి సన్నగా చీలిన రక్తనాళాలుంటాయి. ఆల్వియోలైకు చేరినప్పుడు ద్రవంలా ఉండే రక్తం... ఒక పల్చని పేపర్షీట్లా మారి అలా నిలబడిపోతుంది. అప్పుడు ఆ 28వ అంతస్తులో బయటి ఆక్సిజన్ దేహానికి అంది, శరీరంలోని కార్బన్‌డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. ఇలా వెళ్లే క్రమంలో ఊపిరితిత్తులను బయటి కాలుష్యాల నుంచి రక్షించడానికి సన్నటి సీనియా అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవన్నీ వెలుగుతున్న కొవ్వొతి మంట చివరిభాగంలా, ఒక్కోసారి కొరడా ఝుళిపించినట్లుగా కదులుతూ గాలిలోని పొగ, కాలుష్యాలను బయటకు పంపిస్తుంటాయి. సాధారణంగా మన శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ తయారవుతూ ఉంటుంది. అలాగే కాలుష్య పదార్థాలను బయటకు నెట్టివేసే సీలియా సక్రమంగా పనిచేయడానికి వీటి చుట్టూ పలచని మ్యూకస్ ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. అందుకే మన ముక్కు ఉపరితలం వద్ద ఉంటే మ్యూకస్ ఎప్పుడూ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. ఇలా మ్యూకస్‌తో కలిపి కాలుష్యాలను బయటకు నెట్టేసే చర్య కారణంగా ఊపిరితిత్తుల్లో ఉన్న సీలియరీ వ్యవస్థల నిర్మాణాన్ని మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ అని కూడా అంటుంటారు. ఇలా అవి శరీరంలోకి వచ్చే పదార్థాలను (ఫారిన్ బాడీ) బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్‌నుంచి మనల్ని కాపాడతాయి. చలికాలంలో మరింత జాగ్రత్త అవసరం... ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఉదయం వేళ మినహా గాలి పొడిగా ఉంటుంది. (అందుకే ఈ సీజన్లో ఒంట్లో ఉన్న తేమను వాతావరణం బయటకు లాగేస్తూ ఉన్నందుకే ఒళ్లు, చర్మం, పెదవులు పగిలినట్లుగా అయిపోతాయి. దాన్ని అరికట్టేందుకే మనం వాజిలెన్ వంటివి రాస్తూ ఒంట్లోని తేమను బయటకు పోకుండా రక్షించుకుంటూ ఉంటాం). గాలిలో తేమ తక్కువగా ఉండి, గాలి పొడిగా ఉండటంతో దాని ప్రభావం సీలియరీ వ్యవస్థ మీద కూడా పడి అది దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఈ పొడిదనం కారణంగా మ్యూకస్ ఎండిపోయి చిక్కగా మారి కాలుష్యాలను బయటికి నెట్టడం కూడా కష్టమవుతుంది. పొగతాగే అలవాటుతోనూ, కొన్నిసార్లు కొన్ని రకాల మందులు వాడటం ద్వారా (ఉదాహరణకు ఎట్రోపిన్ వంటివి), మద్యపానంతో కూడా మన ఊపిరితిత్తుల సొంత రక్షణ వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నామని గ్రహించి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ఏం చేయాలి? మనం ఈ కరోనా సీజన్లో వాడే మాస్క్ చలిగాలిని నేరుగా ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా చాలావరకు కాపాడుతుంది. అలాగే కాలుష్యాలనూ అరికట్టగలుగుతుంది. కాబట్టి ఇటు కరోనా నివారణతో పాటు ఊపిరితిత్తుల రక్షణకూ మాస్క్ ఉపయోగపడుతుందని గ్రహించి... తప్పక వాడాలి. ∙సీలియా బాగా పనిచేయడానికి గాలిలో తేమ పెంచాలి. ఇందుకోసం తరచూ ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలు చేపడితే అది తేమను పెంచడంతో పాటు ఈ సీజన్లో శ్వాసనాళాలు కుచించుకుపోకుండా చూస్తూ... ఊపిరితిత్తులకు గాలి ధారాళంగా అందేందుకూ దోహదపడుతుంది. ∙పెదవులతో పాటు గాలి ప్రవేశ ద్వారమైన ముక్కు చివరల వద్ద ఉండే చర్మం కూడా ఈ సీజన్లో పగిలే అవకాశం ఉన్నందున, అక్కడి చర్మం సెన్సిటివ్‌గా మారకుండా అక్కడ కూడా వాజిలెన్ రాయడం మంచిది. ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లను వెంటనే మానేయాలి. -
స్వచ్ఛమైన గాలి కోసం భారీగా కేటాయింపు
న్యూఢిల్లీ: మెట్రోపాలిటన్ సిటీల్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరగిపోయింది. కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని స్థితిలో ఈ నగరాల ప్రజలు బతుకుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనేక సార్లు కామెంట్ చేసింది. వాయు కాలుష్యం దెబ్బకి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని తగ్గింఏందుకు సరి బేసి లాంటి విధానాలతో రోడ్లపైకి వస్తున్న వాహనాలను నియంత్రిస్తున్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి కోసం బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రకటించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో 'క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్' కోసం రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం కోరలు చాచడం వల్ల.. ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నిధులను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపుతో పాటు కొత్త విధానాల రూపకల్పనకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. బడ్జెట్ 2020 : సేద్యం.. వైద్యంపై దృష్టి -
వ్యోమగాముల కోసం మరింత స్వచ్ఛమైన గాలి..
వాషింగ్టన్: అంతరిక్షంలో పరిశోధనల కోసం సంచరించే వ్యోమగాములు వారికవసరమైన ఆహారం, గాలి, నీరుని భూమ్మీదనుంచే తీసుకెళతారు. అక్కడ సాధారణంగా వారు కొన్ని నెలలపాటు తమ పరిశోధనలు కొనసాగిస్తారు. ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారు తీసుకెళ్లిన గాలి, నీరు అంత స్వచ్ఛంగా ఉండదు. వారు తీసుకునే గాలి, నీరు స్వచ్ఛమైందో కాదో తెలుసుకోవడం కష్టం. అందుకే వ్యోమగాములకు మరింత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం కోసం జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు వ్యోమగాములు తీసుకునే గాలి, నీటి నమూనాల్ని సేకరించి భూమి మీదికి పంపించేవారు. ఇక్కడ ఆ నమూనాల్ని పరీక్షించి అవి కలుషితమయ్యాయా లేదా, వాటిలో సూక్ష్మ జీవులు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటారు. ఈ పరీక్షలు పూర్తై ఫలితాలు రావడానికి చాలా కాలం పట్టేది. అయితే శాస్త్రవేత్తలు కొత్తగా రూపొందించిన సెన్సిటివ్ మానిటరింగ్ విధానంతో తక్కువ సమయంలోనే ఫలితాలు పొందవచ్చు. ఈ విధానంలో ఎయిర్ క్వాలిటీ మానిటర్ (ఏక్యూఎమ్) లాంటి పరికరాన్ని వ్యోమనౌకలో అమరుస్తారు. ఇది నీటిని సేకరించి ఆవిరిగా మారుస్తుంది. ఆవిరి రూపంలో ఉన్న నీటిని ఏక్యూఎమ్ పరీక్షించి వెంటనే సురక్షితమో కాదో తెలియజేస్తుంది. దీన్నే వ్యోమగాములు గాలిని పరీక్షించేందుకు కూడా వాడవచ్చు. దీన్ని వినియోగించి వ్యోమగాములు శుద్ధమైన గాలి, నీటిని తీసుకుని అంతరిక్షంలో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ పరికరాన్ని అంతరిక్షంలోనూ, భూమ్మీది మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపయోగించవచ్చు.