వ్యోమగాముల కోసం మరింత స్వచ్ఛమైన గాలి..
వాషింగ్టన్: అంతరిక్షంలో పరిశోధనల కోసం సంచరించే వ్యోమగాములు వారికవసరమైన ఆహారం, గాలి, నీరుని భూమ్మీదనుంచే తీసుకెళతారు. అక్కడ సాధారణంగా వారు కొన్ని నెలలపాటు తమ పరిశోధనలు కొనసాగిస్తారు. ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారు తీసుకెళ్లిన గాలి, నీరు అంత స్వచ్ఛంగా ఉండదు. వారు తీసుకునే గాలి, నీరు స్వచ్ఛమైందో కాదో తెలుసుకోవడం కష్టం. అందుకే వ్యోమగాములకు మరింత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం కోసం జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగా కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు వ్యోమగాములు తీసుకునే గాలి, నీటి నమూనాల్ని సేకరించి భూమి మీదికి పంపించేవారు. ఇక్కడ ఆ నమూనాల్ని పరీక్షించి అవి కలుషితమయ్యాయా లేదా, వాటిలో సూక్ష్మ జీవులు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటారు. ఈ పరీక్షలు పూర్తై ఫలితాలు రావడానికి చాలా కాలం పట్టేది. అయితే శాస్త్రవేత్తలు కొత్తగా రూపొందించిన సెన్సిటివ్ మానిటరింగ్ విధానంతో తక్కువ సమయంలోనే ఫలితాలు పొందవచ్చు.
ఈ విధానంలో ఎయిర్ క్వాలిటీ మానిటర్ (ఏక్యూఎమ్) లాంటి పరికరాన్ని వ్యోమనౌకలో అమరుస్తారు. ఇది నీటిని సేకరించి ఆవిరిగా మారుస్తుంది. ఆవిరి రూపంలో ఉన్న నీటిని ఏక్యూఎమ్ పరీక్షించి వెంటనే సురక్షితమో కాదో తెలియజేస్తుంది. దీన్నే వ్యోమగాములు గాలిని పరీక్షించేందుకు కూడా వాడవచ్చు. దీన్ని వినియోగించి వ్యోమగాములు శుద్ధమైన గాలి, నీటిని తీసుకుని అంతరిక్షంలో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ పరికరాన్ని అంతరిక్షంలోనూ, భూమ్మీది మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపయోగించవచ్చు.