ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
మున్ముందు కిరిబాటీ, చివరగా న్యూ సమోవా
2025కు వేడుకగా స్వాగతం పలికిన ప్రజలు
న్యూఢిల్లీ: ఆంగ్ల సంవత్సరాది సర్వత్రా నూతనోత్తేజం నింపింది. వేడుకలు, పార్టీలతో ఉత్సవ వాతావరణం నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఏ దేశంలో చూసినా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలన్నీ భారీ జనసందోహంతో కిటకిటలాడాయి. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు తదితరాలు కళకళలాడాయి. ఎప్పట్లాగే క్రిస్మస్ ఐలాండ్‌గా పేరొందిన కిరిబాటీ రిపబ్లిక్ 2025ను స్వాగతించిన తొలి దేశంగా నిలిచింది. ఎంత ముందుగా అంటే, అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 31 ఉదయం ఐదింటికే అక్కడ నూతన సంవత్సర వేడుకలు మొదలైపోయాయి! తర్వాత పావు గంటకే పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఉన్న చాదం ఐలాండ్స్‌లో, ఆ వెంటనే న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాయి.
అర్ధరాత్రి క్యాలెండర్ మారి 2024 డిసెంబర్ 31 కాలగర్భంలో కలిసిపోతూనే న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ నగరంలో సంబరాలు మిన్నంటాయి. తర్వాత ఆ్రస్టేలియా, జపాన్ తదితర దేశాలూ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. ఆ్రస్టేలియాలోని చారిత్రక సిడ్నీ మార్బర్ బ్రిడ్జి బాణసంచా పేలుళ్లు, కళ్లు మిరుమిట్లుగొలిపే లేజర్ షోలతో పట్టపగలును తలపించింది. బ్రెజిల్‌లోని రియోడిజనిరో నగరంలో న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. కోపాచబానా బీచ్ ఏకంగా 12 నిమిషాల పాటు బాణసంచా వెలుగుల్లో తళుకులీనింది. అక్కడి వేడుకల్లో ఏకంగా 20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు.
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో వందేళ్ల సంప్రదాయం ప్రకారం బాల్ డ్రాప్ వేడుక జరగనుంది. జోనాస్ బ్రదర్స్, సోఫీ ఎలిస్–బెక్‌స్టర్, రీటా ఓరా తదితరులు సంగీత ప్రదర్శనలతో అలరించనున్నారు. అమెరికాలోని ఇతర నగరాలూ సంబరాలకు సిద్ధమయ్యాయి. అమెరికన్ సమోవా ప్రజలు ఎప్పట్లాగే అందరికన్నా ఆలస్యంగా న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పనున్నారు. న్యూజిలాండ్‌తో పోలిస్తే ఏకంగా 24 గంటల తర్వాత అక్కడ తేదీ మారుతుంది! యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌తో పాటు పలు పశి్చమాసియా దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ సందడికి బదులు ఎప్పట్లా శ్మశాన నిశ్శబ్దమే తాండవించింది.
భారత్‌లో సందడి
భారత్‌లో దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు దుమ్మురేపాయి. రాజధాని ఢిల్లీ మొదలుకుని అన్ని ప్రధాన నగరాల్లోనూ పలు కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ప్రజలంతా ఇళ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. వేడుకగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ఢిల్లీలోని ఇండియా గేట్, కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్, ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా, చెన్నై మెరినా బీచ్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్ తదితర చోట్ల జనం ఇసుక వేసినా రాలనంతగా కన్పించారు. ఇక గోవాలోనైతే కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఏ నగరంలో చూసినా క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, పార్కులు తదితరాలన్నీ కిటకిటలాడాయి. అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందుబాబులకు ముకుతాడు వేసేందుకు అన్ని నగరాల్లోనూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటికీ తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి హిమపాతంతో తడిసి ముద్దవుతున్న ఉత్తరాఖండ్, కశ్మీర్ తదితర చోట్లకు జనం పోటెత్తారు. ఉత్తరాఖండ్‌లోని హర్షిల్, దయారా, సంక్రి వంటి మారుమూల ప్రాంతాలకు కూడా దేశం నలుమూలల నుంచీ పర్యాటకులు విరగబడ్డారు. చుట్టూ మంచు నడుమ టెంట్లు, క్యాంపుల్లో బస చేశారు. అర్ధరాత్రి కాగానే న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అక్కడి హోటళ్లు, దాబాలు అత్యంత వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలు జరిపి ఆకట్టుకున్నాయి. కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో కొలువుదీరిన కుంభనగరిలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment