న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుందనే చర్చ జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవర్ రైలును ఆపినప్పటికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శబ్ధం వచ్చింది. ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.
ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. దీనివెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించినట్లు ఉంది. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమధ్య ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు డాగ్ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తునకు ఇది ఆటంకం కలిగించే అంశంగా మారింది. కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్‌లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment