
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ప్రత్యేక దేశం, రిజర్వు బ్యాంక్, కరెన్సీ, జెండా ఏర్పాటు చేసుకున్న నిత్యానంద తాజాగా ఓ ప్రకటన చేశాడు. ‘కైలాస’ని సందర్శించాలని భావిస్తున్న వారికి వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పటికే ‘కైలాస’ ద్వీపం పేరు మీదుగా ఓ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. ఇక ‘కైలాస’ను దర్శించాలనుకునేవారు దీని ద్వారా వీసాకు అప్లై చేసుకోవచ్చని తెలిపాడు. ఈ నేపథ్యంలో కైలాసను సందర్శించాలనుకునే వారి కోసం ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా ‘గరుడ’ పేరుతో చార్టెడ్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు కూడా నిత్యానంద ‘కైలాస’ ఎక్కడ ఉందనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు. దీన్ని బట్టి ‘కైలాస’ ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఉంటుందని భావిస్తున్నారు.
Kailasa trip is open now. You can apply for visa. And have a Darshan of Lord Shiva physically. 👺 pic.twitter.com/ywGH2qpypi
— Vishweshwar Bhat (@VishweshwarBhat) December 17, 2020
ఇక సందర్శకులకు కేవలం మూడు రోజుల పాటే ‘కైలాస’లో ఉండటానికి అనుమతి ఉంది. అంతకు మించి ఎక్కువ రోజులు ‘కైలాస’లో బస చేయడానికి లేదు. అయితే ఈ మూడు రోజుల్లోనే ‘కైలాస’లో వారికి పరమ శివుడి సాక్షాత్కారం లభిస్తుందని నిత్యానంద హామీ ఇస్తున్నాడు. ఇక ‘కైలాస ’వెబ్‌సైట్ కైలాస. ఓఆర్‌జీ ప్రకారం తమ దేశాల్లో హిందుత్వాన్ని ఆచరించే హక్కు కోల్పోయి బహిష్కరింపబడిన వారంతా కలిసి ఈ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 22 వినాయక చవితి సందర్భంగా నిత్యానంద తాను ప్రత్యేకంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాక తన దేశం కైలాస కోసం ప్రత్యేక రిజర్వ్ బ్యాంక్, కరెన్సీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. తన ప్రత్యేక కరెన్సీ వివిధ దేశాల్లో చెల్లుబాటు అయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వెల్లడించారు. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!)
ఇక నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి.. కైలాసను ఏర్పాటు చేశాడనే వార్తల్ని ఆ దేశం కొట్టి పారేసింది. ఇక ప్రస్తుతానికిక కైలాస, నిత్యానంద ఎక్కడ ఉన్నారనే దాని గురించి సరైన సమాచారం లేదు. ఇదిలా ఉండగా నిత్యానందపై ఇప్పటికే అనేక ఫిర్యాదలు నమోదయ్యాయి. కర్ణాటక, గుజరాత్‌లలో ఆశ్రమాలు స్థాపించి ఆధ్మాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment