నిపుణుల సూచనల మేరకే ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశం
ఎన్‌డీఎస్‌ఏతో భేటీ వివరాలను మంత్రి ఉత్తమ్‌ను అడిగి తెలుసుకున్న రేవంత్
నేడు అధిష్టానం పెద్దలు, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌లను వినియోగంలోకి తెచ్చే విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. శనివారం ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలోనే ఉన్న ఆ శాఖ కార్యదర్శులు, రాహుల్ బొజ్జా, ప్రశాంత్ పాటిల్‌లను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఆదివారం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి, తన అధికారిక నివాసంలో వీరితో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు చర్చించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక వచ్చేంతవరకు బరాజ్‌లో నీటిని నిల్వ చేయరాదని, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించిన విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.
కాళేశ్వరం బరాజ్‌ల విషయంలో సొంత నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దని, నిపుణుల కమిటీ సూచనల మేరకే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి, అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, సోమవారం ఎన్‌డీఎస్‌ఏతో మరోమారు భేటీ ఉన్న దృష్ట్యా, నిపుణుల సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు, ఇతర పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది.
అధిష్టానం పెద్దలతో భేటీ కానున్న సీఎం
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ రాష్ట్ర రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రుణమాఫీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్‌లో ‘కృతజ్ఞత సభ’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాహుల్ గాం«దీని ఆహా్వనించనున్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ షెడ్యూల్‌ను బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించే అవకాశముందని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సీఎం చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులతోనూ భేటీ?
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రేవంత్‌రెడ్డి కలుస్తారని తెలిసింది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశముందని చెపుతున్నారు.
కాగా, సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు సహా తెలంగాణలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వారు కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment