
న్యూఢిల్లీ: రూ. 20,000 వరకూ విలువ చేసే రూ. 2,000 నోట్లను మార్చుకొనేందుకు ఎటువంటి ఫారం లేదా రిక్విజిషన్ స్లిప్ అవసరం లేదని ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. అలాగే వినియోగదారుడు ఎటువంటి ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సిన అవసరం లేదని స్థానిక ప్రధాన కార్యాలయాలకు పంపిన సూచనల్లో పేర్కొంది. నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలకు అవసరమైన తోడ్పాటు అందించాలని సూచించింది.
రూ. 2,000 నోట్లను మార్చుకోదల్చుకున్న వారు ఎన్ని సార్లయినా బ్యాంకును సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు, మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. దీంతో చాలా మంది వినియోగదారులు శనివారం నుంచే తమ ఖాతాల్లో జమ చేసుకొనేందుకు, మార్చుకొనేందుకు బ్యాంకులకు వెళ్లినప్పటికీ బ్యాంకు సిబ్బంది వారిని తిప్పి పంపారు.
కొందరు కస్టమర్లు నగదు డిపాజిట్ మెషీన్ల ద్వారా తమ ఖాతాల్లోకి రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జ్యువెలరీ షాపుల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే రూ. 2,000 నోట్లను తీసుకొనేందుకు ఆభరణాల సంస్థలు సందేహించి, నగదు కొనుగోళ్ల పరిమితి నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు అడిగినట్లు సమాచారం. రూ. 2,000 నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులపై ఎటువంటి ప్రభావం ఉండదని, కానీ పెద్ద సంఖ్యలో ఆ నోట్లను నిల్వ చేసుకున్న సంపన్నులపై ప్రభావం ఉండొచ్చని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ పేర్కొంది.
పసిడికి ‘2000’ బూస్ట్!
రూ. 2,000 నోట్ల ఉపసంహరణతో కొనుగోళ్లపై ఆసక్తి
ముంబై: రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో దేశీయంగా పసిడి, వెండి కొనుగోళ్లపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరిపే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడించాయి. అయితే కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను కఠినంగా పాటిస్తుండటంతో గత రెండు రోజులుగా వాస్తవంగా లావాదేవీలు ఆ స్థాయిలో ఏమీ జరగలేదని పేర్కొన్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యువెలర్లు 5–10 శాతం ఎక్కువ వసూలు చేయడం మొదలుపెట్టాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫలితంగా 10 గ్రాముల పసిడి రూ. 66,000 పలుకుతోందని వివరించాయి. మరోవైపు 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలోలాగా ఆందోళనకర పరిస్థితేమీ లేదని ఆభరణాల సంస్థల సమాఖ్య జీజేసీ తెలిపింది. ‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు చాలా ఎంక్వైరీలు వచ్చాయి. కానీ కఠినతరమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవంగా జరిగిన కొనుగోళ్లు తక్కువే’ అని జీజేసీ చైర్మన్ సైయ్యమ్ మెహ్రా తెలిపారు. నోట్ల ఉపసంహరణకు నాలుగు నెలల సమయం ఉన్నందున ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏమీ లేవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment