
సాక్షి, హైదరాబాద్: ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపూర్ శర్మను జైలుకు పంపాలని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నుపూర్‌శర్మపై బీజేపీ చాలా ఆలస్యంగా చర్యలు చేపట్టిందని విమర్శించారు. బీజేపీ నేతలు చేసిన తప్పుకు దేశమంతా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భారతీయ ముస్లింలు ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పరా.. విదేశీయులు అడిగితేనే చెప్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు. కాగా, జూబ్లీహిల్స్ పబ్ గ్యాంగ్‌రేప్ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. నిందితులు క్షమించరాని నేరం చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.