రాయ్‌పూర్: దాదాపు రెండేళ్ల తర్వాత.. దంతేవాడ ఉదంతంతో ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు భారీ నష్టం వాటిల్లింది. పది మంది పోలీస్ సిబ్బంది మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు. స్థానిక పండుగను ఆసరాగా తీసుకుని మావోయిస్టులు 50 కేజీల ఐఈడీతో సిబ్బంది కాన్వాయ్‌పై దాడికి పాల్పడగా.. నిర్లక్ష్యం పదిమంది పోలీసులు, ఒక డ్రైవర్ మొత్తం పదకొండు మంది ప్రాణాల్ని బలిగొంది.
అయితే మరణించిన పది మంది డీఆర్‌జీ(డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) సిబ్బందిలో.. ఐదుగురు మాజీ మావోయిస్టులేనని అధికారులు చెప్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జోగా సోధి(35), మున్నా కడ్తి(40), కానిస్టేబుల్స్ హరిరామ్ మాండావి(36), జోగా కవాసి(22), గోప్నియా సైనిక్(సీక్రెట్ ట్రూపర్స్), రాజురామ్ కార్తమ్(25).. గతంలో మావోయిస్టులని.. కొన్నేళ్ల కిందటే లొంగిపోయి డీఆర్‌జీలో చేరారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మంచి జీవితం కోసం పాకులాడిన ఆ ఐదుగురు ఇలా అర్థాంతరంగా మావోయిస్టుల చేతిలో బలికావడం భాదాకరమని పేర్కొన్నారాయన.
► మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న బస్తర్ డివిజన్‌లో డీఆర్‌జీ విభాగంలో స్థానిక యువతను, లొంగిపోయిన మావోయిస్టులనే రిక్రూట్ చేసుకుంటుంది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ. విద్యార్హతను పెద్దగా ప్రామాణికంగా తీసుకోదు కూడా!. ఈ క్రమంలోనే.. మావోయిస్టు గ్రూపుల నుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన ఆ ఐదుగురు.. డీఆర్‌జీలో చేరారు. సుక్మా జిల్లా అర్లంపల్లికి చెందిన సోధి, దంతేవాడ ముదర్ గ్రామానికి చెందిన కడ్తి 2017లో డీఆర్‌జీలో చేరారు. అదేవిధంగా మాండావి 2020, కార్తమ్ 2022లో పోలీస్ ఫోర్స్‌లో చేరారు. దంతేవాడ బడే గదమ్ గ్రామానికి చెందిన కవాసి మాత్రం కిందటి నెలలోనే డీఆర్‌జీలో చేరాడు అని ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు.
► డీఆర్‌జీ.. District Reserve Guard (DRG) ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ పరిధిలోని విభాగం. బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో డీఆర్‌జీ సిబ్బందిని మోహరించారు. గత మూడు దశాబ్దాలుగా బస్తర్ రీజియన్‌లో పేట్రేగిపోతున్న మావోయిస్టులను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. డీఆర్‌జీతో పాటు ఇతర సాయుధ బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతూ వస్తన్నారు.
► డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్‌ను 2008లో ఉత్తర బస్తర్ కన్కర్, అబుజ్మద్ నారాయణ్‌పూర్‌లలో మోహరించారు. ఐదేళ్ల తర్వాత బీజాపూర్, బస్తర్ జిల్లాలకు డీఆర్‌జీ బలగాలను విస్తరించారు. ఆ మరుసటి ఏడాది సుక్మా, కొండాగావ్ జిల్లాలకు, చివరికి.. 2015లో దంతేవాడకు డీఆర్‌జీని విస్తరించింది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ.
► బుధవారం దంతేవాడ నుంచి అర్నర్‌పూర్‌కు డీఆర్‌జీ బలగాలను తీసుకొచ్చేందుకు ఏడు వాహనాలతో కాన్వాయ్ వెళ్లింది. ఆ సమయంలో ఆ దారిలో కొందరు పిల్లలు పండుగ కోసం వచ్చీపోయే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి సాధారణంగానే ఉందనుకుని.. అదే రూట్‌లో పోలీస్ సిబ్బందితో కాన్వాయ్ తిరుగు పయనం అయ్యింది. కానీ, మావోయిస్టులు పిల్లలను పక్కకు పంపించేసి.. యాభై కేజీల ఐఈడీని అమర్చి దాడికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీకి కన్నీటి విన్నపం
Comments
Please login to add a commentAdd a comment