పాట్నా: జూన్ 23న పాట్నా వేదికగా సమావేశం కానున్న అఖిలపక్ష నేతలు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సొరేన్ తదితర ముఖ్యనేతలు హాజరు కానున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఈ నేతలంతా ఒక్కచోట కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
2024 ఎన్నికలే లక్ష్యం...
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా అఖిలపక్షాలు పావులు కదుపుతున్నాయి. వన్ ఆన్ వన్ సిద్దాంతానుసారంగా ఒక పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా తమ పార్టీలకు చెందిన ఒకే ఒక బలమైన ప్రత్యర్థిని నిలబెట్టి బీజేపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉంచేందుకు చేతులు కలపనున్నాయి అఖిలపక్ష పార్టీలు.
బద్దశత్రువులంతా ఒకే చోట..?
ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ఎజెండాగా జూన్ 23న పాట్నాలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనున్నట్లు జనతాదళ్ యునైటెడ్ జాతీయాధ్యక్షుడు రాజీవ్ రంజన్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా ఎనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు.
ఒక్క పార్టీ కోసం ఒక్కటయ్యారు..
ఈ సమావేశానికి ముందే అఖిలపక్ష నేతలంతా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకలకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన తర్వాత సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి హాజరై పక్క రాష్ట్రాల నేతలంతా తమ బలప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి కూడా వీరంతా ఏకతాటిపై నిలిచి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
ఇలా అవకాశమున్నప్పుడల్లా ఐక్యత చాటుకుంటూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మరో విమానాన్ని సిద్ధం చేసిన ఎయిర్ ఇండియా..
Comments
Please login to add a commentAdd a comment