Parliament Monsoon Session 2023: History of No-Confidence Motion in Lok Sabha - Sakshi
Sakshi News home page

Parliament Monsoon Session 2023: 27సార్లు.. ఒక్కటీ నెగ్గలేదు

Published Thu, Jul 27 2023 4:05 AM | Last Updated on Thu, Jul 27 2023 7:35 PM

Parliament Monsoon Session 2023: History of no-confidence motion in Lok Sabha - Sakshi

స్వతంత్ర భారత చరిత్రలో లోక్‌సభలో ఇప్పటిదాకా ఏకంగా 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. వాటి కారణంగా ఒక్కసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోలేదు. అయితే ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో మాత్రం కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అనే అధ్యయన సంస్థ పేర్కొంది.

ఇందిరపై అత్యధికంగా 15 ‘అవిశ్వాసాలు’
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధాని హయాంలో ఇదే అత్యధికం!
► ఇందిరపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు దిగ్గజం హీరేంద్రనాథ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే మద్దతివ్వగా 270 మంది వ్యతిరేకించారు.1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసమూ వచి్చంది. తర్వాత 1967, 1968 (రెండుసార్లు), 1969, 1970, 1973, 1974 (రెండుసార్లు), 1975 (రెండుసార్లు–రెండోసారి ఎమర్జెన్సీ విధింపుకు కేవలం నెల రోజుల ముందు), 1976, 1978, 1981 (రెండుసార్లు), 1982ల్లో ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
► 1976లో ఇందిర ప్రభుత్వంపై బీజేపీ (నాటి జనసంఘ్‌) మేరునగం అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రవేశపెట్టడం విశేషం! దానికి ఏకంగా 162 మంది ఎంపీలు మద్దతిచ్చారు! ఒక అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచి్చన అత్యధిక ఓట్లు ఇవే. 257 మంది వ్యతిరేకంచడంతో తీర్మానం వీగిపోయింది.


ఇదీ చరిత్ర...
► స్వతంత్ర భారత చరిత్రలో తొట్టతొలి అ విశ్వాస తీర్మానం 1963లో లోక్‌సభ తలుపు తట్టింది. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే చెందిన ఆచార్య కృపాలనీ దీన్ని ప్రవేశపెట్టడం విశేషం. 1962లో చైనాతో యుద్ధంలో ఓటడిన వెంటనే కృపాలనీ ఈ చర్యకు దిగారు. దీనిపై ఏకంగా 4 రోజుల పాటు 20 గంటలకు పైగా చర్చ జరిగింది. కేవలం 62 మంది ఎంపీలు మాత్రమే దీన్ని సమరి్థంచారు. 347 మంది వ్యతిరేకించడంతో చివరికి తీర్మానం వీగిపోయింది.
► లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వంపై 1964లో ఎన్‌సీ ఛటర్జీ 1965లో ఎస్‌.ఎన్‌.ది్వవేది, స్వతంత్ర పార్టీ ఎంపీ ఎం.ఆర్‌.మసానీ ప్రవేశపెట్టారు.
► 1979లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రాజీనామాకు దారితీసింది. తీర్మానంపై ఓటింగ్‌ జరగక చర్చ అసంపూర్తిగా మిగిలిపోయినా ఆయన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం!
► 2003లో వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష నేత హోదాలో నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం 189 మంది ఎంపీలు మద్దతివ్వగా, 314 మంది వ్యతిరేకించారు. దాంతో 21 గంటల చర్చ అనంతరం తీర్మానం వీగిపోయింది.
► 2018 మోదీ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి 135 మంది ఎంపీలు మద్దతివ్వగా 330 మంది వ్యతిరేకించారు.

పీవీపై మూడుసార్లు
తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొంది! తొలిసారి 1992లో బీజేపీ ఎంపీ జశ్వంత్‌సింగ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలపై లోక్‌సభ వేదికగా నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం జరిగింది. ఏకంగా 225 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతిచ్చారు. 271 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయి పీవీ సర్కారు ఊపిరి పీల్చుకుంది! 1992లోనే పీవీ ప్రభుత్వంపై వాజ్‌పేయీ, 1993లో అజయ్‌ ముఖోపాధ్యాయ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
రాజీవ్‌ సర్కారుపై మన ఎంపీ మాధవరెడ్డి...
► 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్‌ టీడీపీ ఎంపీ సి.మాధవరెడ్డి కావడం విశేషం! అయితే అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement