ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
దర్యాప్తునకు ఎంత సమయం పడుతుందో రాత పూర్వకంగా చెప్పాలని ఆదేశాలు
బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 27కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో తిరుపతన్న గతేడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ప్రధాన నిందితుడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని.. 2023 డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చే శారని లూథ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు.
మరోవైపు తిరుపతన్న 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జిïÙట్ దాఖలైందని తిరుపతన్న తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. బెయిల్ పొందడం హక్కు అని.. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచి్చందని దవే ప్రస్తావించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న ధర్మాసనం... విచారణను ఎప్పటికి పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అంతేగాక దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేరని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు సమయం పడుతుందని, అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను జస్టిస్ నాగరత్న ధర్మాసనం జనవరి 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment