న్యూఢిల్లీ: సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ సోమవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘బ్రిటిష్ కాలం నుంచి ఉన్న విధానానికి ఇప్పుడు తెరపడింది. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’అని ట్వీట్ చేశారు.
ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేదు. ఈ నిర్ణయంతో మరణించిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు మేలు కలుగుతుందన్నారు. అలాగే అవయవదానం చేయాలనుకునే వారి నుంచి అవయవాలు తీసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, దీంతో ఎలాంటి అనుమానాలు ఉన్నా భవిష్యత్తులో నివృత్తి చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment