చంద్రునిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..? | Presence Of Water On The South Pole Of The Moon In Indian Astronomy | Sakshi
Sakshi News home page

చంద్రుని దక్షిణ ధృవంపై నీటి జాడ.. భారతీయ వేద శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

Published Sat, Aug 19 2023 9:24 PM | Last Updated on Sun, Aug 20 2023 4:46 PM

Presence Of Water On The South Pole Of The Moon In Indian Astronomy - Sakshi

ప్రస్తుతం మనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరబోతోంది. చంద్రుని దక్షిణ ధృవం లో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించ బోతున్నాము? , అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది?, దాని లక్షణాలు.  అలాగే చంద్రుని పై మట్టి పొరలు వాటి  లక్షణాలు, సాంకేతికంగా, మానవాళికి వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి అంశాలను తెలుసుకుంటాం.  

చారిత్రకంగా చూస్తే , ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు పంపిన చంద్రయాన్ ఉపగ్రహాలన్నీ చంద్రుని ఉత్తర ధృవం మీదకు మాత్రమే చేరగలిగాయి . దక్షిణ ధృవం మీదకు కొన్ని ఉపగ్రహాలు పంపగలిగినా అక్కడ పరిశోధనలేమీ జరగలేదు. ఇప్పుడు  మనం పంపిన  చంద్రయాన్-3.. దక్షిణ ధృవం మీద దిగుతూ, రోవర్ సహాయంతో  14 రోజుల పాటు జరపబోయే ప్రయోగాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. 

మన భారతీయ వేద విజ్ఞానం, పురాణాలూ ఇతిహాసాలు , యజ్ఞ యాగాదులలో కూడా ఖగోళ రహస్యాలను, గ్రహగతులు, లక్షణాల గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు మన భారతీయ సాంప్రదాయంలో  జరుపుకునే యజ్ఞ యాగాదులలో , సత్యనారాయణ స్వామి  వ్రతంలో   నవగ్రహ పూజ జరుపుతాము . ఆ సందర్భంలో చంద్రుని గురించి ఈ క్రింద మంత్రం చెబుతాం (నవ గ్రహ సూక్తం).   ప్రస్తుతం మన ఆసక్తి అంతా చంద్రుడు కావున, దాని గురించి ఏమి చెప్పారో పరిశీలిద్దాం 
నవ గ్రహ సూక్తం లో చంద్రుని గురించిన శ్లోకం యిలా ఉంటుంది 

• ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ 
సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్ర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి 

• అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ 
చంద్ర గ్రహస్య దక్షిణతః  అధి దేవతాం ఆపః సాంగం సవాహనం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి 

• గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ ॥
చంద్ర గ్రహస్య ఉత్తరతః ప్రత్యధి దేవతా గౌరి సాంగం సవాహనం సాయుధం సశక్తి , సపతి, పుత్ర పరివార సమేతం గౌరి ఆవాహయామి స్థాపయామి పూజయామి 

ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒ నమః॑ ॥ 2 ॥

ఈ క్రింద యిచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తే , సూర్యునికి ఆగ్నేయ దిక్కులో చంద్ర గ్రహాన్ని చూడగలము . ప్రతి గ్రహానికి దేవత  మూడు ప్రధాన స్థాయిలు ఉన్నాయి. గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి  దేవత.  గ్రహం  ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అధి దేవత మీకు సహాయం చేస్తుంది. అవేమిటో ఒక్కక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము. 

ముందుగా గ్రహ దేవత అయిన చంద్రుని గురించి ఏమి చెప్పారంటే 

• ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ 
ఆప్యా॑యస్వ (దయచేయండి ), సమే॑తు (ఒక చోటికి చేర్చు ) , తే (మీరు) , వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ (విశ్వ వ్యాప్తంగా వరాలను దీవెనలను అందించి ప్రయోజనం కలిగించే చంద్రుడు ), భవా॒ వాజ॑స్య సంగ॒థే  (మీరే మా బలంగా మారండి ) 
చంద్రుని అధి దేవత - ఆపః (నీరు), యిది చంద్రునికి దక్షిణ దిక్కులో ఉంటుంది, ఈ నీటి గురించి ఇంకేమి  చెప్పారంటే 

• అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥  
అప్సుమే (ఈ నీటిలో ), సోమో॑ (చంద్రుని అంశ ) , అబ్రవీదం (చెప్పబడినది ), అంతర్విశ్వా॑ని (సమస్త - యూనివర్సల్ ) భేషజా (నివారణ ) 

ఈ ప్రకారం చంద్రునికి దక్షిణ దిక్కులో నీరు వున్నది, ఆ నీటి మీద జరిపే పరిశోధనల మూలంగా చంద్రుడి స్వభావాన్ని,  పూర్వోత్తరాలను అర్థం చేసుకోగలం అని స్పష్ట మవుతుంది ఈ నీటి కి  ఔషధ లక్షణాలు ఉండటం వలన ఇది వైద్య రంగంలో సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది  అని చెప్పారు.

తరువాత చంద్రుని  ప్రత్యధి దేవత గౌరి, ఉత్తర దిక్కులో వున్న ప్రత్యధి దేవత గౌరి గురించి ఏమి చెప్పారంటే 

• గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ 
మిమాయ (సృష్టించు), సలి॒లాని (నీళ్లు , ద్రవాలు), తక్ష॒తి (ఆధారం ) , ఏక॑పదీ (ఒక పాదం )... నవ॑పదీ (9 పాదాలు) , బభూ॒వుషీ  (ఆమె అవుతుంది ), స॒హస్రా᳚క్షరా (అనంత నేత్రాలు కలది ), పరమే (సుప్రీం ), వ్యో॑మన్  (ఆకాశం, అంతరిక్షం ) 

ఈ శ్లోకం గౌరీ దేవత  వైవిధ్యమైన రూపాలను వివరిస్తుంది, అలాగే సృష్టి, విశ్వం  వివిధ అంశాలలో ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది.  
ఇప్పటి వరకు చంద్రుని మీదకు చేరిన వివిధ దేశాల ఉపగ్రహాలను ఈ క్రింది చిత్రంలో చూడగలరు. దాదాపు అన్నీ చంద్రుని ముందు భాగం,  పై అర్థ భాగంలోనే ఉన్నాయి.  చైనా 2019 లో ప్రయోగించిన చేంజ్-4 మాత్రమే చంద్రుని వెనుక భాగం వైపు దించారు. 

చంద్రునిపై నీటి ఆనవాళ్లు:
చంద్రునిపై నీరు ఉందని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ నీరు భూమిపై మనకు కనిపించే నీటికి భిన్నంగా ఉండే రూపాల్లో ఉంది. NASA వాళ్ళు 2018 లో విడుదలచేసిన మ్యాప్‌లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటాయి. గడ్డ కట్టడానికి (-157 డిగ్రీల సెల్సియస్) వీలు కల్పిస్తాయి. అలానే 2020 లో NASA విడుదల చేసిన మ్యాప్‌లు , సూర్యరశ్మి  ఉన్న ప్రాంతాలలో కూడా నీరు ఉన్నట్లు ధృవీకరించింది.

ఇప్పటికి వరకు చంద్రుని పైన లభించిన ప్రకారం Lunar Regolith (లూనార్ రెగోలిత్) లో ఘనమైన శిలలను కప్పి ఉంచే వదులుగా ఉండే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచించాయి.  చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ అణువులు (హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక) కనుగొనబడ్డాయి.  ఇలాంటి నీరు భవిష్యతుల్లో మంచి వనరులుగా ఉపయోగమున్నప్పటికీ వీటి వెలికితీత సవాళ్లు తో కూడుకున్న పని.  అలాగే ఈ చంద్రుని నీటిని అధ్యయనం చేయడం వలన చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే  గొప్ప అవకాశం లభిస్తుంది .

ఈ రకంగా మన ఋషులు ద్రష్టలు వేదవాఙ్మయం ద్వారా అందించిన ఖగోళ శాస్త్ర రహస్యాలను, ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో క్రోడీకరించి , ప్రపంచ మానవాళి మనుగడకు ఉపయోగపడే  నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతారని ఆశిద్దాం.

                                                                                                                                                                                      -Dr. Y. Hanumantha Rao, email: hanuyr@gmail.com

ఇదీ చదవండి: Chandrayaan 3 Mission Details: చంద్రయాన్‌–3.. త్రీ ఇన్‌ వన్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement