పుణే: విపరీతంగా పెరిగిపోయిన టమాటా ధరలతో సామాన్య వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. మహారాష్ట్రలో పుణే జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం టమాటాలతో కేవలం ఒక నెల వ్యవధిలో ఏకంగా రూ.3 కోట్లు ఆర్జించాడు. ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. పుణే జిల్లాలో జున్నార్ తహసీల్ పరిధిలోని పాచ్‌గఢ్ గ్రామంలో రైతు ఈశ్వర్ గాయ్‌కర్(36) చాలా ఏళ్లుగా టమాటా పంట సాగు చేస్తున్నాడు.
ఇన్నాళ్లూ నష్టాలే చవిచూశాడు. ఈ ఏడాది మే నెలలో సరైన ధర లేక టమాటాలను వృధాగా పారబోశాడు. ఇప్పుడు ధరలు పెరగడంతో ఈశ్వర్ పంట పండింది. అతడి శ్రమ ఫలించింది. జూన్ 11 నుంచి జూలై 18 మధ్య 3,60,000 కిలోల టమాటాలను సమీపంలోని నారాయణగావ్ మార్కెట్‌లో విక్రయించాడు. రూ.3 కోట్ల ఆదాయం కళ్లజూశాడు.
తన పొలంలో మరో 80,000 కిలోల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, మరో రూ.50 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఈశ్వర్ చెప్పాడు. టమాటా పంట సాగు, రవాణాకు రూ.40 లక్షలు ఖర్చయినట్లు తెలిపాడు. తనకు 18 ఎకరాల భూమి ఉందని, అందులో 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నానని వెల్లడించాడు. జూన్ 11న కిలోకు రూ.38 చొప్పున, జూలై 18న కిలోకు రూ.110 చొప్పున ధర పలికిందని ఆనందం వ్యక్తం చేశాడు.
టమాటా సాగుదారులకు ఇది మంచి కాలమని, కానీ, ఒక రైతుగా ఎన్నో గడ్డు రోజులు కూడా చూశానని అన్నాడు. టమాటాలకు కిలోకు రూ.రెండున్నర సైతం రాని రోజులు ఉన్నాయని వివరించారు. టమాటాల సాగు వల్ల 2021లో తనకు దాదాపు రూ.16 లక్షల నష్టం వచ్చిందని, 2022లో మాత్రం స్వల్పంగా లాభపడ్డానని చెప్పాడు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రకు చెందిన మరో రైతు రాజు మహాలే టమాటాల సాగుతో ఈ సీజన్‌లో రూ.20 లక్షలు సంపాదించాడు.
అలా అయితే కిలో టమాటాలు ఫ్రీ
ఛండీగఢ్ ఆటోవాలా వినూత్న ఆఫర్
తన ఆటో ఎక్కితే కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానంటూ చండీగఢ్‌లో అరుణ్ అనే ఓ ఆటో డ్రైవర్ ఆఫర్ ప్రకటించాడు. అయితే కనీసం ఐదుసార్లు తన ఆటో ఎక్కిన వారికే ఆఫర్ వర్తిస్తుందంటూ తిరకాసు పెట్టాడు! మనవాడిది ముందునుంచీ సేవా గుణమే. 12 ఏళ్లుగా సైనికులను ఫ్రీగా ఆటో ఎక్కించుకుంటున్నాడు. అంతేకాదు, గర్భిణులను ఉచితంగా ఆస్పత్రికి కూడా చేరేస్తుంటాడు. ‘‘ఆటోయే నా జీవనాధారం. కాబట్టి టమాటాల హవాను ఇలా అదనపు ఆదాయ మార్గంగా మార్చుకోవాలని వినూత్న ఆలోచన చేశానంతే. అయితే మన సైనిక వీరులకు, కాబోయే తల్లులకు చేసే సేవలోనే నాకు అమితమైన తృప్తి దొరుకుతుంది’’ అని చెబుతాడు అరుణ్. అక్టోబర్లో పాకిస్తాన్‌తో చండీగఢ్‌లో జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వరుసగా ఐదు రోజుల పాటు అందరికీ తన ఆటోలో ఉచిత ప్రయాణమేనని ప్రకటించేశాడు అరుణ్!
కిలో.70కే సబ్సిడీ టమాటా: కేంద్రం
టమాటాలను ఇప్పటికే కిలో కేవలం రూ.80కి విక్రయిస్తున్న కేంద్రం, తాజాగా సబ్సిడీని మరో 10 రూపాయలు తగ్గించింది. గురువారం నుంచి రూ.70కే కిలో టమాటాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. టమాటాల రేటు కొంతకాలంగా చుక్కలనంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగా పలు ఇతర కీలక నగరాల్లోనూ వాటిని సబ్సిడీపై కేంద్రం అందుబాటులోకి తేవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment