
కేంబ్రిడ్జి: తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం జీవితంలో తనకు అతి పెద్ద అనుభవ పాఠమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘అది నాకు తీవ్ర వేదన మిగిల్చింది. ఒక కొడుకుగా తండ్రిని కోల్పోవడం చాలా బాధ కలిగించింది’’ అన్నారు. లండన్లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో కార్పస్ క్రిస్టి కాలేజీ ఆధ్వర్యంలో ‘ఇండియా ఎట్ 75’ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు.
నాన్న మరణం తనకెన్నో విషయాలు నేర్పిందన్నారు. భారత ప్రత్యేకతను చాటే కీలక వ్యవస్థలపై ప్రణాళికాబద్ధ దాడి జరుగుతోందని ఆరోపించారు. కీలక వ్యవస్థల గొంతు నొక్కేసి, ఆ స్థానంలోకి ప్రవేశించిన తెరవెనుక శక్తులు, తమ సొంత బాణీని వినిపిస్తున్నాయన్నారు. హిందూ జాతీయవాదం, కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం పాత్ర తదితరాలపై విద్యార్థులు, భారత సంతతి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
దేశానికి ఆత్మగా భావించే కీలకమైన పార్లమెంట్, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో ఉంచుకుందని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీ చెప్పే దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమ్మిళితం చేసేది కాదు. 20 కోట్ల మంది ప్రజలను ఏకాకులుగా మారుస్తూ వారిని దుష్టులుగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకరం’’ అని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఈ విధానాలపై అవసరమైతే జీవితకాలం పోరాడతామన్నారు. యూకే పర్యటనలో లేబర్ పార్టీ నేత జెరెమీ కొర్బిన్‌తో రాహుల్ భేటీని బీజేపీ తప్పుబట్టింది. కొర్బిన్ వ్యక్తం చేసే భారత వ్యతిరేక విధానాలకు వంత పాడుతున్నారా అని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment