
ధర్మేంద్ర, స్వప్న.. మధ్యలో చంద్రుడి పట్టా
చంద్ర మండలంపై కాలు మోపిన తొలి మానవుడు నీల్ ఆర్మ్‌స్రాంగ్ అయితే, చంద్ర మండలంపై ప్లాటు కొన్న తొలి రాజస్థానీ.. బహుశా ధర్మేంద్ర అనీజా కావచ్చు. ధర్మేంద్రా? ఎవరాయన? ఒక భర్త! ఈ భూగోళంపై ఆయన ఉండేది రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో. ఆయన భార్య స్వప్న ఉండేది మాత్రం చల్లని జాబిల్లి వంటి ఆయన హృదయంలో. అందుకే కావచ్చు, తమ పెళ్లి కానుకగా చంద్రుడిపై మూడెకరాల స్థలం కొని ఆమెకు కానుకగా ఇచ్చాడు! అయితే ఆ మూడెకరాలూ స్వప్న తలవాల్చే ధర్మేంద్ర ఛాతీ కన్నా విశాలమైనదేమీ కాబోదు. ఆయన ఆమెను ఎంతలా ప్రేమిస్తాడో పైకి చెప్పుకుంటే ఆయన ప్రేమను చిన్నబుచ్చినట్లే.
అందుకే ఎవరికీ అందనంత ఎత్తులో తన ప్రేమ కానుకను ఉంచుకున్నాడు. కానుకను ఉంచాడంటే భార్య కోసం తన హృదయ పీఠాన్ని ఉంచాడనే. డిసెంబర్ 14 న ఈ దంపతుల 8 వ పెళ్లి రోజు. ఆ రోజు కోసం ఏడాది ముందే నెలరాజుకు నిచ్చెన వేశాడు ధర్మేంద్ర. అంత పెద్ద ప్రాసెస్ అది. న్యూయార్క్ సిటీలోని ‘లూనా సొసైటీ ఇంటర్నేషనల్’ కు మెయిళ్లు పెట్టి, కొన్ని వందల డాలర్లు పంపి ప్లాట్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ‘ఎంతయ్యింది ధర్మేంద్రా’ అని లోకల్‌గా ఉండే భర్తలు అడుగుతుంటే.. ‘అమూల్యం’ అంటున్నాడు. స్వప్నదీ అదే మాట. ‘‘ఆయన ఏం ఇచ్చారని, ఎంతకు కొన్నారని నేను చూడటం లేదు. స్పెషల్‌గా ఏదైనా ఇవ్వాలన్న ఆయన మనసులోని ప్రేమ అనే వెన్నెలలో తడిసి ముద్ద అవుతున్నాను’’ అంటోంది ధర్మేంద్ర భుజంపై వాలిపోతూ. తగిన భార్యే.
Comments
Please login to add a commentAdd a comment