ఐఐటీ తయ్యూరు వేదిక
సాక్షి, చెన్నై: రవాణా వ్యవస్థలో అతి వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ రైలు సేవల మీద ఐఐటీ తయ్యూరు క్యాంపస్‌లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నై మెట్రో రైలు, ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన మీద దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే చెన్నై విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించబోతున్న పరందూరుకు 15 నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది.
చెన్నైకు ప్రత్యామ్నాయంగా కాంచీపురం పరిధిలోని పరందూరులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చెన్నై విమానాశ్రయం నుంచి పరందూరు వైపుగా మెట్రో సేవలకు సైతం ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పూందమల్లి వరకు ఉన్న మెట్రో రైలు సేవలను పరందూరు వరకు పొడిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు.
మెట్రో మార్గంలో చెన్నై నుంచి పరందూరుకు గంట సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతివేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా చెన్నై–పరందూరు మధ్య 15 నిమిషాల్లో చేరుకునేలా కొత్తమార్గంపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీ మీద ఐఐటీ తయ్యూరు క్యాంప్ పరిశోధకులు, విద్యార్థులు కొంతమేరకు పరిశోధనలో ఫలితాలు సాధించినట్టు సమాచారం.
అసలేంటీ ‘హైపర్ లూప్’
లూప్ అనేది పైప్‌లైన్‌లాంటి మార్గం. పాట్ అనే రైలు పెట్టె లాంటి వాహనంలో వాయువేగంలో దూసుకెళ్లే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. అయస్కాంతం సహకారంతో గాల్లో వేలాడుతూ గంటకు 600 కి.మీ వేగంతో ఈ హైపర్ లూప్ అతి వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ హైపర్ లూప్‌లో ఒకే సమయంలో 40 మంది ప్రయాణించేందుకు వీలుంటుందని సమాచారం
Comments
Please login to add a commentAdd a comment