సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లకు సంబంధించి.. ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీం కోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చినట్లయ్యింది. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో పాటు 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్‌ను సవాలు చేస్తూ.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69 మందిలో.. పిటిషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ జాకియా, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సేతల్వాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
2012లో SIT దాఖలు చేసిన నివేదికకు వ్యతిరేకంగా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు. అయితే ఆ ఉత్తర్వును సుప్రీం కోర్టు జస్టిస్ AM ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ అయితే శుక్రవారం.. సమర్థించింది. అంతేకాదు.. జాఫ్రీ యొక్క అభ్యర్థన ఎటువంటి అర్హత లేనిదని పేర్కొంది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. మాజీ పోలీసు అధికారి సంజీవ్ భట్ స్టేట్‌మెంట్ ఆధారంగా మోదీపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే భట్ ఆ సమావేశంలో లేరని, అందువల్ల ఆరోపణలను ధృవీకరించడానికి వేరే మార్గం లేదని సిట్ తేల్చింది. మరోవైపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఈ ఆరోపణ న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
అల్లర్ల కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీంకోర్టు.. ఆరోపణలను పరిశీలించాల్సిందిగా 2011లో సిట్‌ను ఆదేశించింది. ఫిబ్రవరి 2012లో, సిట్ నివేదిక(క్లోజ్డ్) దాఖలు చేసింది. అయితే.. ఈ నివేదికపై ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయడంలో పిటిషనర్లు విఫలం అయ్యారు. తిరిగి.. 2018లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. కిందటి ఏడాది డిసెంబర్‌లోనే తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment