![Serum Institute To Develop Vaccine For Monkeypox: Adar Poonawalla - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/28/serum.jpg.webp?itok=MCsORJPT)
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలవరపరుస్తున్న మంకీపాక్స్ వైరస్ నియంత్రణకు టీకాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) అదర్ పూనావాలా చెప్పారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మంకీపాక్స్ వైరస్ సోకడం వల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడితే సిడుబు అనే రోగానికి వాడే టీకాను వాడవచ్చని సూచించారు.
మంకీపాక్స్ నియంత్రణకు త్వరలోనే టీకాను కనిపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. టీకాను కనిపెట్టడానికి గాను తాము నోవావాక్స్ సంస్థతో చర్చలు జరిపామని వెల్లడించారు. మంకీపాక్స్ టీకా కోవిడ్–19 టీకా కంటే భిన్నంగా ఉంటుందని పూనావాలా వివరించారు. ఈ టీకా నిల్వ, నిర్వహణకు ప్రత్యేక కంటైన్మెంట్ సౌలభ్యాలు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేయడానికి సదుపాయాలు లేవని, కానీ పరిస్థితి మారవచ్చని తెలిపారు.
మూడు నెలల్లో భారత్‌కు టీకాలు
డెన్మార్క్‌లోని బవేరియన్ నార్డిక్ సంస్థ నుంచి మంకీపాక్స్ టీకాలను దిగుమతి చేసుకొనేందుకు చర్చలు జరుపుతున్నామని అదర్ పూనావాలా వెల్లడించారు. రెండు నుంచి మూడు నెలల్లో టీకాలు భారత్‌కు అందవచ్చని తెలిపారు. భారత్‌లో ఇప్పటిదాకా మంకీపాక్స్ కేసులో స్వల్ప సంఖ్యలోనే నమోదయ్యాయని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment