
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక చోట మళ్లీ హిజాబ్ విషయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
అయితే, హిజాబ్ వివాదంపై హైకోర్టు తుది తీర్పు వెల్లడించే వరకు స్కూల్స్, కాలేజీలకు విద్యార్థులు.. హిజాబ్‌లు, శాలువాలు, మతపరమైన జెండాలను ధరించి రావద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గురువారం ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఓ కాలేజీని సందర్శిస్తున్న క్రమంలో కొందరు విద్యార్థినిలు హిజాబ్ ధరించి ఉండటాన్ని గమనించారు. దీంతో వారిని పిలిచి కోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు. అనంతరం బాలికలు కోర‍్టు తీర్పును సిక్కులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేయడంతో వారు షాకయ్యారు.
దీంతో చేసేదేమీ లేక ఓ సిక్కు బాలిక(17) అమృతధారి(బాప్టిజం తీసుకున్న బాలిక) తలపాగాను తొలగించాలని కాలేజీ యాజమాన్యం కోరింది. వెంటనే సదరు కాలేజీ యాజమాన్యం కోర్టు తీర్పును బాలిక తండ్రి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కాగా, తన కూతురు తలపాగా తొలగించదని ఆయన కాలేజీ యాజయాన్యానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే సిక్కుల తలపాగా గురించి కోర్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో హిజాబ్ వివాదం కాస్తా సిక్కులను తాకడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment