ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందం బౌఖ్‌నాగ్ దేవతను వేడుకున్నారట.
గత ఏడాది నవంబర్‌లో సిల్క్యారా టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్‌నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment