న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి కేంద్రంగా మారి, అప్పటి అధ్యక్షుడు జాకబ్ జుమా పదవీ చ్యుతికి కారకులై దుబాయ్ పారిపోయిన భారత సంతతి వ్యాపారవేత్తలు గుప్తా బ్రదర్స్ ఎట్టకేలకు చట్టానికి చిక్కారు. రాజేశ్ గుప్తా (51), అతుల్ గుప్తా (53)లను సోమవారం దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని దక్షిణాఫ్రికా రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆ దేశ నేషనల్ ప్రాసిక్యూటింగ్ అధికారి వెల్లడించారు. మూడో సోదరుడు అజయ్ గుప్తా అరెస్టుపై స్పష్టత లేదన్నారు. ఈ పరిణామాన్ని దక్షిణాఫ్రికా విపక్ష ప్రతిపక్ష డెమొక్రాటిక్ అలయన్స్ స్వాగతించింది. విచారణ త్వరగా ముగించాలని కోరింది.
చెప్పుల వ్యాపారంతో మొదలై...
ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన అజయ్, అతుల్, రాజేశ్ గుప్తా సోదరులు 90వ దశకంలో దక్షిణాఫ్రికా వెళ్లి చెప్పుల దుకాణం ప్రారంభించారు. చూస్తుండగానే ఐటీ, మీడియా, మైనింగ్ వంటి రంగాలకు వ్యాపారాన్ని విస్తరించడమేకాదు చాలా తక్కువ కాలంలోనే దక్షిణాఫ్రికాలో కుబేరులుగా అవతరించారు. అధ్యక్షుడు జాకబ్ జుమాతో సాన్నిహిత్యంతో 2009–18 మధ్య గుప్తా బ్రదర్స్ ఆర్థికంగా బాగా లాభపడ్డారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ సప్లయర్ ‘ఎస్కాం’ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టారు. మంత్రుల దగ్గర్నుంచి పలు నియామకాలను ప్రభావితం చేశారంటారు. 2016లో ఆర్థిక మంత్రి కావడానికి వీరు 44 మిలియన్ల డాలర్ల లంచం ఆఫర్ చేశారని ఒక అధికారి చెప్పారు. దాంతో వీరి అవినీతి బాగా వెలుగులోకి వచ్చింది.
చదవండి: (తల్లిదండ్రుల పేరుతో బస్టాండ్)
2018 కల్లా ప్రజా నిరసనలు తీవ్రతరమై చివరికి జుమా తప్పుకోవాల్సి వచ్చింది. జుమా హయాంలో ప్రభుత్వ సంస్థలను వేల కోట్ల రూపాయలకు ముంచేసినట్టు గుప్తా బద్రర్స్‌పై ఆరోపణలున్నాయి. మొత్తమ్మీద 15 బిలియన్ రాండ్లు (రూ.7,513 కోట్లు) కొల్లగొట్టారన్న అభియోగంపై విచారణ సాగుతుండగానే వారు కుటుంబాలతో సహా దుబాయి పారిపోయారు. వారి ఆస్తుల్లో చాలావరకు విక్రయించడమో, మూసేయడమో జరిగింది. దక్షిణాఫ్రికా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో రాజేశ్, అతుల్ సోదరులపై గత జూన్‌లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. 15 బిలియన్ ర్యాండ్లు దోచుకున్నారన్నది నిజమేనని తేలినట్టు ఆర్గనైజేషన్ అన్‌డూయింగ్ ట్యాక్స్ అబ్యూస్ సీఈఓ వేన్ డువెన్‌హేజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment