చెన్నై/ఢిల్లీ: జాతీయ స్ఫూర్తి అయిన ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కు పొంగల్ పర్వదినం ప్రతిరూపమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో పొంగల్ వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ తమిళనాడు ప్రజలకు పొంగల్ పర్వదిన శుభాకాంక్షలు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తికి పొంగల్ ప్రతిబింబం. ఇదే భావన కాశీ–తమిళ్, సౌరాష్ట్ర–తమిళ్ సంగమం సంస్కృతిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బియ్యం పిండితో వేసే కోలమ్ రంగవల్లికలు దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య ఉన్న భావోద్వేగాలను కలుపుతున్నాయి. దేశం సత్తా ఇలా కొత్త తరహాలో గోచరిస్తోంది. ఇలాంటి ఐక్యతా భావనే 2047కల్లా వికసిత భారత్ నిర్మాణానికి అతిపెద్ద చోదకశక్తిలా పనిచేస్తోంది. ఎర్ర కోట మీద నుంచి నేను ప్రబోధించిన పంచప్రాణాల్లో ముఖ్యమైనది ఇదే. దేశ ఐక్యతను మరింత శక్తివంతం చేయండి, తద్వారా ఐక్యతను మరింత బలోపేతం చేయండి. తమిళ కవి తిరువల్లువర్ ప్రవచించినట్లుగా జాతి నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయతీ గల వ్యాపారులు, మంచి పంటలది కీలక భూమిక’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ కొత్త పంటను దైవానికి నైవేద్యంగా వండి రైతన్నలు అన్నదాతలుగా మారే చక్కటి శుభ సమయమే పొంగల్ పర్వదినం. దేశంలోని ప్రతి పండుగలో పల్లెపట్టులు, పంటలు, రైతులతో ముడిపడి ఉంటాయి’’ అన్నా రు. ‘‘తమిళ సాంప్రదాయాలకు తృణధాన్యాలకు అవినాభావ సంబంధం ఉంది. పౌష్టిక శ్రీ అన్న(తృణధాన్యం) గురించి యువతలో కొత్త అవగాహన ఏర్పడింది. దీంతో మిల్లెట్స్ రంగంలో అంకుర సంస్థల స్థాపనకూ యువత ముందుకొస్తోంది. మూడు కోట్లకుపైగా రైతులు తృణధాన్యాలను పండించి చక్కని దిగుబడి ద్వారా లబ్ధి పొందుతున్నారు. పొంగల్ సందర్భంగా దేశ సమైక్యత కోసం కొత్త తీర్మానాలు చేసుకుని దేశం కోసం పునరంకితమవుదాం’’ అని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment