గాంధీనగర్: కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో సోమవారం జరిగింది. సుమారు 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ‘కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. మరో 10 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. స్థానిక పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
రోజిడ్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంత మంది ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయమే ఇద్దరు మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి రోజిడ్ గ్రామంలో నాటు సారా తాగిన తర్వాత తన భర్త అనారోగ్యానికి గురైనట్లు ఓ మహిళ.. పోలీసులకు తెలిపింది. మరోవైపు.. ఆదివారం రాత్రి ఓ కొట్టులో నాటు సారా కొనుగోలు చేసిన తర్వాత సుమారు 25 మందికిపైగా అనారోగ్యానికి గురైనట్లు ఓ బాధితుడు తెలిపారు.
సోమవారం సాయంత్రం బొటాడ్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు భవనగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ యాదవ్. డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుజరాత్ పర్యాటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నాటు సారా అమ్ముతున్నట్లు ఆరోపించారు.
ఇదీ చదవండి: గంజాయి తాగాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఉచిత సలహా!
Comments
Please login to add a commentAdd a comment