న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎట్టకేలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ)కి ఎస్‌బీఐ సమర్పించింది. 2 రోజుల్లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఈసీ తమ వెబ్‌సైట్‌లో పెట్టనుంది.
కాగా మార్చి 12 సాయంత్రం వరకు ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకు సమర్పించింది.
ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకు గడువును పెంచాలని కోరుతూ ఎస్‌బీఐ చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మార్చి 12 పని వేళలు ముగిసేలోగా ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.
మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్‌బీఐ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు హర్షించాయి.
Comments
Please login to add a commentAdd a comment