Sticky Bombs Amid Threat To Amarnath Yatra - Sakshi
Sakshi News home page

Amarnath Yatra: అమరనాథ్‌ యాత్రపై కన్నేసిన ఉగ్రవాదులు

Published Wed, Jun 8 2022 8:07 AM | Last Updated on Wed, Jun 8 2022 4:02 PM

Sticky Bombs Amid Threat To Amarnath Yatra - Sakshi

మూడేళ్ల విరామం తర్వాత మొదలవుతున్న అమరనాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు కన్నేశారు. జూన్‌ 30 నుంచి మొదలై 43 రోజుల పాటు సాగే యాత్రను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా స్టికీ బాంబులతో విరుచుకుపడొచ్చని నిఘా వర్గాలకు ముందే ఉప్పందింది. ఇందుకోసం తరలిస్తున్న ఈ బాంబుల్ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో స్టికీ బాంబుల కథా కమామిషు... 

హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్‌ యాత్రను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు స్టికీ బాంబులతో సవాల్‌ విసురుతున్నారు. ఇందులో భాగంగా వాటిని డ్రోన్ల ద్వారా తరలిస్తుండగా జమ్ము పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్ము శివార్లలో పాక్‌ డ్రోన్‌ ఒకటి ఓ పేలోడ్‌ను జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్‌ బాక్సులు అందులో దొరికాయి. 3, 8 గంటల్లో పేలేలా వాటికి టైమర్లు కూడా సెట్‌ చేశారు. వాటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. అమర్‌నాథ్‌ యాత్రలో భక్తులపై ప్రయోగించేందుకే వీటిని పాక్‌ నుంచి తరలించినట్టు చెప్పారు. 

తొలిసారి వాడిందెప్పుడు
స్టికీ బాంబుల్ని తొలిసారిగా బ్రిటన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించింది. అప్పట్లో ఇది గ్రెనేడ్‌లా ఉండేది. గోళాకారపు గాజు ఫ్లాస్క్‌లో నైట్రో గ్లిసరిన్‌ నింపి తయారు చేసేవారు. దాన్ని లోహంతో కవర్‌ చేసి అంటించేవారు. బాంబును ప్రయోగించేటప్పుడు దాని రక్షణ కవచాన్ని బయటకు లాగి విసిరేవారు. ఐదు సెకండ్లలో బాంబు పేలేది. అఫ్గానిస్తాన్, ఇరాక్‌ యుద్ధాల్లో వీటిని బాగా వాడారు. గతేడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించినప్పుడు అమెరికా సైనికులపై వీటిని ఎక్కువగా వాడారు. కాబూల్లో జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ స్టికీ బాంబులు పెటట్డంతో అమెరికా సైనికులు నిత్యం హడలిపోయేవారు. 2020 డిసెంబర్‌లో కాబూల్‌ డిప్యూటీ ప్రొవిన్షియల్‌ గవర్నర్‌ను స్టికీ బాంబుతోనే బలిగొన్నారు. 

చదవండి: (బెంగాల్‌ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత)

మన దేశంలో... 
►2012 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయంపై దాడిలో స్టికీ బాంబులు వాడారు. 
►2012 ఫిబ్రవరిలో కశ్మీర్‌లో సాంబా సెక్టార్‌లో భద్రతా దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి. 
►2021 ఏప్రిల్‌లో జమ్ము శివార్లలో సిధారా బైపాస్‌ దగ్గర, ఆగస్టులో పూంచ్‌లో ఇవి దొరికాయి.
►2021 మేలో కథువాలోని హరియా చౌక్‌ దగ్గర మినీ డ్రోన్‌ను కశ్మీర్‌ పోలీసులు కూల్చేశారు. అందులోనూ స్టికీ బాంబులు దొరికాయి.
►2021 మేలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న బస్సు పెట్రోల్‌ ట్యాంక్‌కు స్టికీ బాంబులు అతికించి నలుగురిని బలిగొన్నారు.

భద్రతా వ్యూహంలో మార్పు  
స్టికీ బాంబులతో ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదమున్నందున ఈసారి అమర్‌నాథ్‌ యాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు.   – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ఏమిటీ స్టికీ బాంబులు? 
చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక  అదీ సులభంగా మారింది. పార్క్‌ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement