
సోషల్ మీడియా కట్టడిపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ కంటెంట్ ప్లాట్‌ఫాంలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి, ఏది పడితే అది జనంపై రుద్ద డానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూ ట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమ వారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఒక సమగ్ర వ్యవస్థ తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వం వాదనతో ఏకీభవించింది. అలాగని రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వా తంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను హరించే సెన్సార్‌షిప్ మాదిరిగా ఉండరాదని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
‘‘వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ ఆర్టికల్ 19(4) పరిధులకు లోబడి ఉండేలా సోషల్ మీడియా నియంత్రణకు నిబంధనలను సూచించండి. అనంతరం వాటిపై ఇరు వర్గాలతో పాటు ప్రజల నుంచి కూడా సలహాలు, సూ చనలు స్వీకరించండి’’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు. భారత సమాజ నైతిక ప్రమాణాలకు గొడ్డలిపెట్టు వంటి అశ్లీల, అభ్యంతరకర ఆన్‌లైన్ కంటెంట్ ప్రసారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని ఎస్‌జీ అన్నారు. ‘‘నైతికత విషయంలో మిగతా దేశాలకు, మనకు తేడా ఉంది. అమెరికాలో జాతీయ పతాకాన్ని తగలబెట్టడం ప్రాథమిక హక్కు. మన దగ్గర మాత్రం క్రిమినల్ నేరం’’ అని ఉదహరించారు.
సోషల్ ఖాతాల నిషేధంపై సమీక్ష
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల వాదనలు వినకుండానే వారి ఖాతాలను నిషేధించడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ గవాయ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ప్రభు త్వాలకు ఇందుకు వీలు కల్పిస్తున్న ఐటీ రూల్స్, 2009లోని 16వ నిబంధనను కొట్టేయాలన్న పిటిషనర్ అభ్యర్థనపై కేంద్రం స్పందన కోరింది. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ అప్లికేషన్లు, సోషల్ మీడియా అకౌంట్లకు నోటీసులివ్వకుండా, వాదనలే వినకుండా బ్లాక్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. సోషల్ మీడియా గురించి ధర్మాసనానికి బాగా తెలిసే ఉంటుందని జైసింగ్ అనడంతో జస్టిస్ గవాయ్ సరదాగా స్పందించారు. ‘‘నేనైతే ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేను. ఎక్స్‌లోనే కాదు, వై, జెడ్ వేటిలోనూ లేను’’ అనడంతో నవ్వులు విరిశాయి.
Comments
Please login to add a commentAdd a comment