సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం అభిప్రాయం తెలుసుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. గత విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చి ఐదు నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించగలదా అని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) నటరాజన్‌ను ధర్మాసనం అడిగింది. కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని తెలంగాణ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
ఆస్తుల విభజన రాష్ట్ర విభజన చట్టంలోని అంశమని, రూ.1.42 లక్షల కోట్ల ఆస్తులను విభజించకపోవడం సరికాదని ఏపీ న్యాయవాది సింఘ్వి చెప్పారు. ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నియమించినట్లు ఈ వ్యవహారంపైనా విశ్రాంత న్యాయమూర్తితో కమిటీని నియమించాలని కోరారు. ఆ విధంగా చేయొచ్చా అని నటరాజన్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. చేసే అవకాశం ఉందని ఆయన సమాధానమిచ్చారు. వాదనల అనంతరం నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జూలై చివరి వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment