
యూట్యూబ్ షోలో అసభ్యకర వ్యాఖ్యలపై మండిపాటు
సమాజానికే అవమానం అంటూ అభ్యంతరం
ప్రస్తుతానికి అతడిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశం
న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్ రణ్‌వీర్ అలహాబాదియా అలియాస్ బీర్‌బైసెప్స్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యాఖ్యలు వక్రబుద్ధితో కూడినవంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ పేరుతో యూట్యూబ్‌లో కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన షోలో రణ్‌వీర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర, అసోంల్లో కేసులు నమోదయ్యాయి.
ఆయన వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘మీ మనసులో ఉన్న నీచమైన ఆలోచనలను షోలో వెళ్లగక్కారు. మీరు వాడిన పదజాలం కుమార్తెలు, తోబుట్టువులు, తల్లిదండ్రులే గాక మొత్తంగా ఈ సమాజమే అవమానంగా భావించేలా ఉంది. ఇది అశ్లీలత కాకపోతే మరేమిటి? మీపై నమోదైన కేసులను ఎందుకు కొట్టివేయాలి? దేశవ్యాప్తంగా పలుచోట్ల మీపై నమోదవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఎందుకు కలపాలి?’’ అని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం నిలదీసింది.
చౌకబారు ప్రచారం కోసం మీరు ఇలాంటివి చేస్తే, ఇలాగే చీప్ పబ్లిసిటీ కావాలనుకునేవారు బెదిరింపులకు పాల్పడతారంటూ ధర్మాసనం తలంటింది. వాక్ స్వాతంత్య్రం ఉందని సమాజ సహజ విలువలు, సూత్రాలకు విరుద్ధంగా మాట్లాడేందుకు ఎవరికీ లైసెన్సు లేదని స్పష్టం చేసింది. అతడు వాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా? అని లాయర్ అభినవ్ చంద్రచూడ్‌ను ప్రశ్నించగా, వ్యక్తిగతంగా తనకూ అసహ్యం కలిగించాయంటూ ఆయన బదులిచ్చారు.
ఆసే్ట్రలియా టీవీ ప్రోగ్రామ్‌లో ఓ నటుడి డైలాగ్‌ను కాపీ కొట్టి అలహాబాదియా ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తమకూ తెలుసునని ధర్మాసనం పేర్కొంది. ‘ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దలకు మాత్రమే అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఆ్రస్టేలియా కార్యక్రమాన్ని కాపీ చేసిన ‘ఇండియాస్ గాట్ లాటెంట్’నిర్వాహకులు ఈ జాగ్రత్తలేవీ తీసుకోలేదు’అని ధర్మాసనం తెలిపింది.
ఇకపై కేసులొద్దు
అలహాబాదియాకు చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఈ ఒక్క అంశంపైనే చాలా చోట్ల కేసులు నమోదయ్యాయంటూ లాయర్ అభినవ్ చంద్రచూడ్ తెలపడంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆయనను ప్రస్తుతానికి అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా, ఇదే అంశంపై ఇకపై కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. ఇకపై ఆ యూట్యూబ్ షోను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. కొంతకాలంపాటు ఇతర షోల్లో పాల్గొనవద్దని అలహాబాదియాకు స్పష్టం చేసింది.
పాస్‌పోర్ట్‌ను థానే పోలీసులకు ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, మహారాష్ట్ర, అసోం పోలీసులకు విచారణలో సహకరించాలని అతడిని ఆదేశించింది. తనపై నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని, వాటన్నిటిపై ఒకే చోట విచారణ జరపాలంటూ అలహాబాదియా వేసిన పిటిషన్‌పై కేంద్రం, మహారాష్ట్ర, అసోం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
వివాదాస్పద కామెడీ షోకు సంబంధించిన మొత్తం 18 ఎపిసోడ్లను తొలగించాలని యూట్యూబ్‌ను కోరారు. ఖర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలంటూ అలహాబాదియాకు ముంబై పోలీసులు సమన్లు ఇచ్చారు. అయితే, అతడు తమతో టచ్‌లో లేడని ముంబై పోలీసులు తెలిపారు. అలహాబాదియాపై ఇండోర్, జైపూర్‌లలోనూ కేసులు నమోదయ్యాయి.
ఆప్ నేత సత్యేందర్ జైన్‌పై విచారణకు రాష్ట్రపతి అనుమతి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్(60)ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి మంజూరు చేశారు. ఆయనపై ఆరోపణలకు తగు ఆధారాలున్నందున దర్యాప్తునకు అనుమతివ్వాలంటూ హోం శాఖ రాష్ట్రపతిని కోరింది. ఈ మేరకు ఆమె భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 218 ప్రకారం అనుమతించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సమాచారంతో ఈడీ కోర్టులో తాజాగా సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేయనుంది. హవాలా లావాదేవీల ఆరోపణలపై మంత్రిగా ఉన్న జైన్‌ను ఈడీ 2022 మేలో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment