ముంబై: ఇటీవలి కాలంలో గ్రామాల్లో పులుల సంచారం ఎక్కువైంది. పంట పొలాల్లోకి వస్తున్న పులులు.. ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో పులి దాడిలో ఓ గర్భిణి మరణించింది. దీంతో, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల ప్రకారం.. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతంలో శనివారం ఉదయం పులి దాడి ఘటన వెలుగు చూసింది. పులి దాడిలో ఓ గర్భిణి మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) పులి దాడిలో మరణించిన విషయం తెలిసిందే. నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది.
మరో ఘటనలో సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది. పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment