ఓర్వకల్లు, కొప్పర్తిలో ఏర్పాటు.. రాష్ట్రానికి 68 ప్రైవేట్ ఎఫ్‌ఎం స్టేషన్లు.. కేంద్ర కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: వికసిత్ భారత్ దృష్టితో ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దేశంలోని 10 రాష్ట్రాల్లో ఆరు ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో రూ.28,602 కోట్ల వ్యయంతో 12 ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా ఏపీలో రూ.2,786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో, రూ.2,137 కోట్లతో కొప్పర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇదేకాకుండా ఏపీలో 68 ప్రైవేట్ ఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రెండూ కర్నూలు జిల్లాలోనే..
కర్నూలు జిల్లాలో కొప్పర్తి ఇండ్రస్టియల్ స్మార్ట్‌సిటీ కర్నూలు ఎయిర్‌పోర్టుకు 11 కిలోమీటర్ల దూరంలో 2,596 ఎకరాల్లో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.2,137 కోట్లు కాగా, రూ.8,860 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఈ ప్రాజెక్టు ద్వారా పునరుత్పాదక రంగం, ఆటోమొబైల్ పరికరాలు, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాల్లో 54,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా.
కాగా.. కర్నూలు ఎయిర్‌పోర్టుకు 12 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ 2,621 ఎకరాల్లో నిర్మాణం కానుంది. నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్ పరికరాలు, పునరుత్పాదక రంగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏరో స్పేస్, డిఫెన్స్ హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ జ్యువెలరీ, వస్త్ర రంగాల ద్వారా 45,071 మందికి ఉపాధి కల్పించనున్న ఈ ప్రాజెక్ట్‌లో రూ.12 వేల కోట్ల పెట్టుబడికి అవకాశాలున్నాయి.
కొత్త ఎఫ్‌ఎం స్టేషన్ల ఏర్పాటు ఇలా..
దేశంలోని మొత్తం 234 నగరాల్లో 730 ప్రైవేట్ ఎఫ్‌ఎం కేంద్రాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, మచిలీపట్నం, మదనపల్లి, నంద్యాల, నరసరావుపేట, ఒంగోలు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, విజయనగరం పట్టణాల్లో మూడేసి చొప్పున, కాకినాడ, కర్నూలు పట్టణాల్లో నాలుగు చొప్పున ప్రైవేట్ ఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment