ఆ బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం | Uniform Civil Code 2024 Bill Passed In Uttarakhand Assembly, Becomes First State To Pass This Bill - Sakshi
Sakshi News home page

UCC Bill Uttarakhand: యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం

Published Wed, Feb 7 2024 6:37 PM | Last Updated on Wed, Feb 7 2024 7:49 PM

Uniform Civil Code 2024 Bill Passed Uttarakhand Assembly - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయానికి వేదికైంది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది.  యూసీసీ బిల్లుకు ( UCC Bill Uttarakhand ) ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

తీవ్ర చర్చనీయాంశంగా మారిన.. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపును కల్పించడం... సహ జీవనాన్ని రిజిస్టర్‌ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. అలాగే.. షెడ్యూల్డ్ తెగలను బిల్లు పరిధి నుంచి తప్పించారు.

ఇదిలా ఉంటే.. యూసీసీ బిల్లు రూపకల్పనలో అక్కడి బీజేపీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. విపక్షాల ఆందోళనల నడుమే మంగళవారం ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి దీన్ని ప్రవేశపెట్టారు. ఆపై గందరగోళ పరిస్థితుల నడుమ సభ వాయిదా పడగా.. చివరకు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. ఆమోదం లభించింది.  స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. దేశంలో.. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది.

రెండేళ్ల కసరత్తు తర్వాత.. 
ఇదిలా ఉంటే.. యూసీసీని ఉత్తరాఖండ్‌ బీజేపీ 2022 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే.. సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60వేల మందితో మాట్లాడింది. ఆన్‌లైన్‌లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement