డెహ్రాడూన్: ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆకస్మికంగా సంభవించిన ఈ విలయంలో 170 మంది వరకు గల్లైంతైనట్లు సమాచారం. ఇంతటి విషాదంలో ఓ ఫోన్ కాల్ 12 మంది ప్రాణాలు కాపాడింది. వివరాలు... మంచు చరియలు విరిగిపడటంతో ఉప్పొంగిన ధౌలీనది ఉగ్ర రూపం దాల్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని చమేలి తపోవన్ పవర్ ప్రాజెక్ట్ వర్కర్లు 12 మంది ఓ అండర్‌గ్రౌండ్ టన్నెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రమాదం గురించి.. బయటకు రావాల్సిందిగా తెలిపారు. ఇది విన్న వర్కర్లు టన్నెల్ నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. కానీ ఈ లోపే వరద నీరు టన్నెల్‌లోకి వచ్చింది. అంతేకాక వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రవేశ మార్గాన్ని బురద కప్పేసింది.
టన్నెల్ నుంచి బయటపడే మార్గం లేకపోవడం.. బయట ఉన్న బురద వల్ల లోపల ఉన్న తమ గురించి అధికారులకు తెలిసే అవకాశం ఉండదని భావించిన ఆ 12 మంది వర్కర్లు జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు. అక్కడే సజీవ సమాధి తప్పదని భావించారు. అయితే వారికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని ఓ వ్యక్తి మొబైల్ నిరూపించింది. అతడి ఫోన్‌కి సిగ్నల్ అందడంతో వెంటనే కంపెనీకి కాల్ చేసి తమ పరిస్థితిని వివరించాడు. ఈ విషయాన్ని కంపెనీ జీఎం ఐటీబీపీ అధికారులకు చెప్పడంతో వారు టన్నెల్ వద్దకు చేరుకుని బురదను తొలగించి.. వర్కర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరందరిని ఐటీబీపీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘మేం 300 మీటర్ల లోతైన టన్నెల్‌లో ఉన్నాం. వరద నీటిలో చిక్కుకున్నాం. ఇక జీవితం మీద ఆశ వదిలేసుకున్నాం. ఈ సమయంలో టన్నెల్‌లో ఓ చోట వెలుతురు పడటం.. గాలి ఆడటం గమనించాం. ఎలాగోలా అక్కడకు చేరుకున్నాం. ఇంతలో మాలో ఒకరి ఫోన్‌కి సిగ్నల్ వచ్చింది. అధికారులకు కాల్ చేయడం.. వారు స్పందించి ఐటీబీపీ వారిని పంపిచడంతో బతికి బయటపడ్డాం. ఆ ఒక్క ఫోన్ కాల్ మా 12 మందిని కాపాడింది. మాకు సాయం చేసిన ఐటీబీపీ అధికారులకు జీవితాంతం రుణపడి ఉంటాం’’ అన్నారు.
చదవండి: విషాదం: 170 మంది మరణించినట్లేనా?
ప్రకృతి విపత్తులతో వణికిపోయిన దైవభూమి
Comments
Please login to add a commentAdd a comment