రక్షాబంధన్‌ ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే... | Vice President Raksha Bandan Wishes to Nation | Sakshi
Sakshi News home page

రక్షాబంధన్‌ విశిష్టతను వివరించిన ఉపరాష్ట్రపతి

Published Mon, Aug 3 2020 10:09 AM | Last Updated on Mon, Aug 3 2020 10:18 AM

Vice President Raksha Bandan Wishes to Nation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్షాబంధన్‌ సందర్భంగా దేశ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధాన్‌ ప్రాముఖ్యతను, ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. దీంతో పాటు భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోషల్‌ మీడియా ఖాతాలో రక్షాంబంధన్‌కు సంబంధించి ఒక పోస్ట్‌ను పెట్టారు. ‘అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ రోజు నేడు. తోబుట్టువులు ఏడాదంతా ఎదురుచూసే ఈ రోజు.. వారిమధ్య బంధాన్ని మరింత పరిపుష్టం చేసే ప్రత్యేకమైన పండుగ రోజు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబవిలువలను ప్రతిబింబించే పండుగ రాఖీపౌర్ణమి. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు, ప్రాచీన జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించటంతోపాటు, కుటుంబసభ్యులకు ఒక సామాజిక భద్రతను కలిగించే గొప్ప ఉత్సవం. ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, బాధ్యతలను కలగలుపుకుని జరుపుకునే పండుగ ఇది. 

తరతరాలుగా ఈ కుటుంబ విలువలను కాపాడుకుంటూ, సామాజిక ఆచారాలు, పండుగలు, జానపద కళలు, పురాణేతి హాసాలు, పవిత్ర మత గ్రంథాల ద్వారా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరానికి వీటిని అందిచడం జరుగుతోంది.  అమరకావ్యమైన రామాయణంలో తన తండ్రిమాటను గౌరవిస్తూ రాజ్యాధికారాన్ని భరతుడికి అప్పగించి అరణ్యవాసానికి బయలుదేరడం,  అటు భరతుడు కూడా అన్నపై ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవంతో ఆయన పాదుకాలతో రాజ్యాన్ని నడిపించడం వంటివి భారతదేశంలోని కుటుంబవిలువలకు ఓ ఉదాహరణ మాత్రమే. సతీ అనసూయ, సీతాదేవికి కుటుంబసభ్యులు, పెద్దలతో బాధ్యతగా మసలుకోవలసిన ప్రాముఖ్యతను వివరించడం రామాయణ మహాకావ్యంలోని మరో ముఖ్యమైన ఘట్టం.  కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి తమ ప్రేమానురాగాలను, బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉత్సాహవంతంగా జరుపుకోవడమే మన పండుగల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. తన వారితో తన ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడం కన్నా మరింత గొప్పది ఏముంటుంది? భారతదేశంలో మానవ సంబంధాలకు, కుటుంబ విలువలకు గౌరవమిస్తూ జరుపుకునే పండగలు కోకొల్లలు. భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే వటసావిత్రీ పౌర్ణమి, కర్వాచౌత్ (ఉత్తరభారతంలో), తమ సంతానం శ్రేయస్సుకోసం తల్లులు పూజలు చేసే అహోయ్ అష్టమి, మన అజ్ఞాన తిమిరాలను తొలగించే గురువులను గౌరవించుకునే గురుపౌర్ణమి ఇలా ఎన్నో పండుగలు బంధాలను మరింత పరిపుష్టం చేసేవే. రక్షాబంధన్ కూడా అలాంటిదే.


‘రక్ష’ అంటే సోదరులు, సోదరీమణుల బంధాన్ని పరిరక్షించేదని అర్థం. సోదరులపై చెడు ప్రభావం పడకుండా రక్షను (రాఖీ) సోదరీమణులు సోదరుల చేతికి కడతారు. దీనికి ప్రతిగా,  సోదరికి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడతానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. అందుకే మన దగ్గర రాఖీ కడుతున్నప్పుడు ‘నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరమూ కలిసి మన దేశానికి రక్ష’ అని పరస్పరం చెప్పుకుంటారు. అదీ రక్షా బంధనంలో ఉన్న గొప్పదనం. అందుకే ఈ పండుగంటే అందరికీ చాలా ఇష్టం.  ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై భిన్న సందర్భాలను పెద్దలు మనకు చెబుతారు. అందులో ఒకటి, పాండవుల ధర్మపత్ని అయిన ద్రౌపది ఒకసారి తన సోదరుడైన శ్రీ కృష్ణుడికి గాయమైనప్పుడు. తన చీర కొంగును చించి కృష్ణుడికి రక్తస్రావం కాకుండా కడుతుంది. దీంతో ఎప్పుడూ సోదరిని, ఈ బంధాన్ని కాపాడుకుకంటానని శ్రీ కృష్ణుడు ప్రమాణం చేస్తాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలోపేతమైందని, అప్పటినుంచి రక్షాబంధనం మన సంప్రదాయంలో భాగమైందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ పండగను,  ఈ ఏడాది ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వచ్చిన ఈ సందర్భంలో.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను జరుపుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. నిస్సందేహంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. కానీ మన వారిని కాపాడుకుంటూ.. వైరస్ తరిమికొట్టేందుకు మనం కుటుంబాలు, బంధువులతో కలిసి ఒకచోట చేరి పండగలు జరుపుకోవడాన్ని నివారించాలి. ఇలా చేయడం వల్ల మనవారిని బాధపెట్టినవారమవుతాం. కానీ, కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో ఇంతకుమించిన ప్రత్యామ్నాయమేదీ లేదు.

 భారతీయ సంప్రదాయాల ప్రకారం ఏడాది పొడగునా చాలా పండగలు జరుపుకుంటాం. కానీ ప్రతీ పండుగ వెనకున్న చారిత్రక నేపథ్యం, పురాణాల్లోని సందర్భం, పండుగ ప్రాశస్త్యం మొదలైన వాటిని యువతరానికి నేర్పించాలి. అప్పుడే వారికి ఈ పండుగల వెనుక ఉన్న నైతిక విలువలు, సమాజంలో వ్యవహరించాల్సిన తీరు మొదలైన అంశాలపై స్పష్టత వస్తుంది. మన పండుగలు మన ఘనమైన వారసత్వానికి ప్రతీకలు. భిన్న సంస్కృతులు భిన్న సామాజిక పరిస్థితులను కలుపుతూ, అందరినీ ఐకమత్యంగా ఉంచే సాధనాలు. కరోనా మహమ్మారి కారణంగా మన పండగలను మునుపటిలా ఘనంగా జరుపుకోలేకపోయినా మనలో ఉత్సాహం, పట్టుదల ఏమాత్రం సడలకుండా ఐకమత్యంతో వైరస్‌ను ఓడిద్దాం. అప్పటి వరకు మనమంతా ప్రభుత్వం సూచించినట్లుగా కరోనాను కట్టడి చేసే నిబంధనలన పాటిద్దాం. ముక్కు, నోటికి మాస్క్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటిద్దాం’ అని వెంకయ్య పేర్కొన్నారు. 

చదవండి: నేనైతే గిఫ్ట్‌ కోసం కట్టను..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement