సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వస్తోన్న నకిలీ (ఫేక్) వార్తలను ఎప్పటికప్పుడు ఎండకడుతూ వాటి వెనకనున్న వాస్తవాలను వెలికి తీస్తోన్న ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకులు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అయింది. జుబేర్‌కు వ్యతిరేకంగా ఒకటి ఢిల్లీలో, మరోటి రాయ్‌పూర్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈ రెండు కేసులను నమోదు చేశారు.
జగదీశ్ సింగ్ అనే ట్విటర్ వినియోగదారుడు జుబేదర్‌కు వ్యతిరేకంగా ట్విటర్‌లో దుర్భాషలాడారు. సింగ్ తన ప్రొఫైల్ పిక్చర్ కింద చిన్న పాప చిత్రాన్ని పెట్టుకున్నారు. దానికి జర్నలిస్ట్ జుబేదర్ సమాధానమిస్తూ ‘సోషల్ మీడియా ద్వారా ప్రజలను దుర్భాషలాడడం నీ పార్ట్ టైమ్ జాబని అందమైన నీ చిట్టి మనమరాలికి తెలుసా? నీ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకోమని సలహా ఇస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఎవరో ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ జుబేర్‌పై చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అందుకని పోలీసులు ఆయనపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ కింద, ఆన్‌లైన్‌లో మైనర్ బాలికను చిత్ర హింసలకు గురిచేస్తున్నారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జగదీశ్ సింగ్ చిన్న పాప చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకోవడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని ‘ఎన్‌సీపీసీఆర్’, మొహం కనిపించకుండా ఆ పాప ప్రొఫైల్ చిత్రాన్ని బ్లర్ చేసి పునర్వినియోగించిన జుబేర్‌పై కేసు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించడం పట్ల మీడియా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద జరిగిన ప్రజాందోళనలో మైనర్ బాల, బాలికలు పాల్గొనడం పట్ల కూడా జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పిల్లలను రోడ్లపైకి తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పోలీసులకు ఆదేశించింది. (ఏ పార్టీలో చేరను.. డాక్టర్‌గానే ఉంటా)
ఆ విషయంలో మీడియా కూడా జాతీయ కమిషన్‌ను తప్పు పట్టలేదు. సమాజంలో పిల్లలకు వ్యతిరేకంగా జరగుతోన్న అత్యాచారాలు, విచారణ పేరిట పోలీసులే మైనర్లను నిర్బంధిస్తూ వేధిస్తున్న సంఘటనలపై జాతీయ కమిషన్ ఎందుకు సకాలంలో స్పందించదన్నది మాత్రమే మీడియా వర్గాల ప్రశ్న. సోషల్ మీడియాలో పుంఖానుపుంఖంగా తప్పుడు వార్తలు, వక్రీకరణలు, అసభ్య విమర్శలు, అర్థంలేని ఆరోపణలు, అసభ్య, అక్రమ వీడియోలు వస్తోన్న చలించని ప్రభుత్వ సంస్థలు, అధికార యంత్రాంగాలు పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు స్పందిస్తాయన్నది మీడియా వర్గాల ప్రశ్న. ఎప్పుడు తప్పుడు వార్తలను ప్రచారం చేసే బీజేపీ ఐటీ సెల్‌ను ఎండగట్టడమే బహుశా తాను చేసిన తప్పేమోనని జర్నలిస్ట్ జుబేర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుచ్చమైన కేసులకు తాను భయపడనని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. (నాకైతే సంబంధం లేదు: సుబ్రహ్మణ్యస్వామి)
Comments
Please login to add a commentAdd a comment