ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు: వికీపీడియా | Wikipedia denies receiving notice from government here what it said | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు: వికీపీడియా

Nov 7 2024 4:22 PM | Updated on Nov 7 2024 4:34 PM

Wikipedia denies receiving notice from government here what it said

భారత ప్రభుత్వం నుంచ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తాజాగా వెల్లడించింది. వికీపీడియాలో ఎడిటింగ్‌ పద్దతులు, కంటెంట్‌లో ఖచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి గత రెండు రోజుల్లో ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని వికీపిడియా ఫౌండేషన్‌ పేర్కొంది. ఈ మేరకు వికీపీడియా ఫౌండేషన్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. వికీపీడియా లాభాపేక్ష లేని సంస్థ అని,ా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఖర్చు లేకుండా లక్షలాది మందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన తెలిపారు.

‘ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు మా సైట్‌కు కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 850 మిలియన్లకు పైగా భారతీయులకు మా సైట్‌ ఉపయోగపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వీక్షకుల్లో భారత్‌ అయిదో స్థానంలో ఉంది. ఇందులో వాలంటీర్లు వారికి తెలిసిన సమాచారాన్ని సైట్‌లో అప్‌లోడ్‌ చేయరు. విశ్వసనీయ వార్తాసంస్థలు, ప్రముఖ ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మా ఆర్టికల్స్‌లోను విశ్వసిస్తారు. 

వికీపీడియాలోని ఎడిటింగ్‌ పద్ధతులు, కంటెంట్‌లోని కచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు.  మా సంస్థలోని తటస్థ నిబంధనలను సంపాదకీయులు ఆచరిస్తారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనేకమంది వాలంటీర్లు మా సంస్థలో భాగమై ఉన్నారు. ఏ ఆర్టికల్‌ అయినా విస్తృత సమాచారంతోనే రాస్తాం. ఆ సమాచారానికి సంబంధించిన సోర్సుల వివరాలు కూడా ఆర్టికల్‌ పేజీల్లో పేర్కొంటాం’ అని తెలిపారు. 

కాగా ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా  ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్‌ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement