యువతిని హత్య చేసి ఫ్రిజ్‌లో ముక్కలు
హంతకుని కోసం పోలీస్ వేట
ఆమె పనిచేసే సెలూన్ సిబ్బందిపై అనుమానం
బనశంకరి: బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్ మునేశ్వరనగరలో సంచలనం సృష్టించిన యువతిని హత్యచేసి 30 ముక్కలుగా కత్తిరించి ఫ్రిజ్‌లో కుక్కిన కేసులో హంతకుని కోసం 6 పోలీస్ బృందాలు గాలింపు ప్రారంభించాయి. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం ముక్కల నమూనాలను మరిన్ని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సుమారు వారం కిందట యువతిని హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టి హంతకుడు పరారయ్యాడు. ఫ్రిజ్ ఆన్‌లో ఉండడంతో వాసన రాలేదు. కానీ అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు ఆ భాగాల నుంచి రక్తం బయటకు కారి దుర్వాసన రాసాగింది.
ఇంట్లో ఒంటరిగా ఉంటానని..
హతురాలిని మహాలక్ష్మి (29)గా గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఆమె గతంలో పెళ్లి చేసుకుని విడిపోయింది. సోదరుడు హుకుంసింగ్ భార్య దీపికతో కలిసి ఈ ఇంట్లో 15 రోజుల కిందటే బాడుగకు దిగారు. నేను ఒంటరిగా ఉంటానని దీపికతో గొడవపడి మరో ఇంటికి పంపించింది. తల్లి మీనారాణా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లేది. మహాలక్ష్మి ఒక మెన్స్ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తూ అక్కడే పనిచేసే ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండేది తెలిసింది. కొద్దిరోజులనుంచి ఇద్దరికి విభేదాలు వచ్చాయి. రెండురోజుల క్రితం ఇంటి వద్దకు వచ్చి వెళ్లాడని స్థానికులు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నలుగురిపై అనుమానం
20వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో మీ చెల్లెలి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని పై అంతస్తులో ఉండే జీవన్‌ప్రకాశ్ అన్న హుకుంసింగ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అతడు తల్లికి ఫోన్ చేయగా, రాత్రి కావడంతో ఉదయం వెళ్లి చూద్దామని అనుకుంది. తరువాత శనివారం వచ్చి చూడగా ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. జీవన్‌ప్రకాశ్ నుంచి మరో తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా దుస్తులు చెల్లాచెదరుగా కనిపించాయి. ఫ్రిజ్‌లో నుంచి రక్తం లీక్ అవుతుంది. లోపల మృతదేహం ముక్కలు ముక్కలుగా అంతటా నింపి ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ కేసులో అష్రఫ్, ముక్త, శశిధర్, సునీల్ అనే నలుగురిపై అనుమానం ఉందని మృతురాలి తల్లిదండ్రులు వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరందరూ మెన్స్ బ్యూటీ సెలూన్‌లో సహోద్యోగులు. ఉత్తరాఖండ్‌కు చెందిన అష్రఫ్‌తో సన్నిహితంగా ఉండేది. హార్రర్ సినిమాలో మాదిరి జరిగిన ఈ దారుణ హత్యోదంతంతో ఆ వీధిలో జనం భయాందోళనలో ఉన్నారు. హంతకుని జాడ తెలిసిందని, త్వరలోనే అరెస్ట్‌చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment