Womens Reservation Bill 2023: ఏకగ్రీవ ఆమోదానికి కలిసి రండి | Womens Reservation Bill 2023: Come together to unanimous approval | Sakshi
Sakshi News home page

Womens Reservation Bill 2023: ఏకగ్రీవ ఆమోదానికి కలిసి రండి

Published Thu, Sep 21 2023 5:56 AM | Last Updated on Thu, Sep 21 2023 5:56 AM

Womens Reservation Bill 2023: Come together to unanimous approval - Sakshi

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు కలిసి రావాల్సిందిగా విపక్షాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. బిల్లులో లోపాలేమన్నా ఉంటే తర్వాత సరిచేసుకుందామని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లు అమలులో ఆలస్యానికి సంబంధించి కాంగ్రెస్‌ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వస్తాయన్న సంకేతాలిచ్చారు. ఓబీసీలకు బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. 

వారికి తమ హయాంలోనే అన్నింటా అత్యధిక ప్రాతినిధ్యం దక్కిందని చెప్పారు. ‘రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది.  పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదానికి ఇది ఐదో ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్‌ లేవనెత్తిన అడ్డంకులను అధిగమించేందుకు వారి హయాంలో ఎందుకు ప్రయతి్నంచలేదు? అందుకే గత నాలుగు సార్లూ బిల్లును ఆమోదించలేని పార్లమెంటు తీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈసారైనా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించుకుందాం‘ అని విపక్షాలను అమిత్‌ షా కోరారు.

రాహుల్‌ పై విసుర్లు
90 మంది కేంద్ర కేబినెట్‌ కార్యదర్శుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను అమిత్‌ ఎద్దేవా చేశారు. ‘కార్యదర్శులు దేశాన్ని నడుపుతారన్నది నా సహచర ఎంపీ అవగాహన! కానీ నాకు తెలిసినంత వరకూ ప్రభుత్వమే దేశాన్ని నడుపుతుంది. విధాన నిర్ణయాలు చేసేది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌‘ అన్నారు. ‘ఎవరో స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన చీటీలను సభలో చదవడం గొప్ప కాదు. ఓబీసీల అభ్యున్నతికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారు‘ అన్నారు. ‘బీజేపీ ఎంపీల్లో దాదాపు 29 శాతం మంది ఓబీసీలే. దేశవ్యాప్తంగా 27 శాతానికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు, 40 శాతానికి పైగా ఎమ్మెల్సీలు ఓబీసీలే’ అని అమిత్‌ అన్నారు.

అప్పుడు కేంద్రాన్నే నిందిస్తారు!
మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను అమిత్‌ షా తోసిపుచ్చారు. ‘రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభా స్థానాలు ఒకవేళ మహిళలకు రిజర్వ్‌ అయితే రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జీ సారథ్యంలోని కమిషన్‌ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది‘ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement