సాక్షి, హైదరాబాద్: కేవలం అతిగా తినడం వల్లే ఊబకాయం రాదు. దీనికి అనేక కారణాలున్నాయి. అతి తక్కువ సమయంలో శరీర బరువు బాగా పెరగడం, ఊబకాయానికి దారి తీస్తుంది. హెరడిటరీ, శారీరక, పర్యావరణ అంశాలతో పాటు మనం తీసుకునే ఆహారం ముఖ్యం పాత్ర పోషిస్తాయి. అధిక బరువుతో అంద విహీనంగా కనపడుతున్నామనే ఒత్తిడి ఒక్కటే కాదు, గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్, స్లీప్ ఆప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ స్థూలకాయం, నివారణ మార్గాలపై కొన్ని అపోహలున్నాయి. నవంబరు 26 వరల్డ్ యాంటీ ఒబెసిటీ డే సందర్భంగా కొన్ని అపోహలు, వాస్తవాలు మీకోసం. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!)
ఊబకాయం అనేది కేవలం కాస్మొటిక్ వ్యాధి మాత్రమేనా? కానే కాదు. లావుగానే ఉన్నామనే తీవ్ర ఆందోళన ఎంత తప్పో, కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్నామే తప్ప, దీనివలన పెద్దగా ఆరోగ్య సమస్యలు రావని అనుకోవడం కూడా భ్రమ. వాస్తవానికి, ఒబెసీటీకి కారణాలు అనేకం, అలాగే ఇది అనేక ఇతర వ్యాధులకు మూల కారణం. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కావచ్చు. ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.
ఊబకాయం అనేది మామూలే, జీవనశైలి రుగ్మత మాత్రమే అనుకుంటే పొరపాటే. సీనియర్ బేరియాట్రిక్ సర్జన్‌ల తాజా లెక్కల ప్రకారం, ఊబకాయం ఇప్పుడు మల్టీఫ్యాక్టోరియల్ ఎటియాలజీతో కూడిన వ్యాధి. ఈ వ్యాధిని నిపుణుల పర్యవేక్షణలో వైద్యపరంగా వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలి.
అంత సులువు కాదు..కానీ
ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బరువు తగ్గవచ్చు. ఇది ఒక విధంగా అపోహ. నేను ఎంత తొందరగా బరువుపెరుగుతానో, అంతే వేగంగా బరువు తగ్గుతాను అని చాలామంది అనుకుంటారు. కొద్దిపాటి సంకల్పం, వ్యాయామం మాత్రమే చాలు అని భావిస్తారు చాలామంది. వాస్తవం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇది అందరికీ సాధ్యం కాదు. స్థూలకాయులకు ఆ అదనపు కిలోలను తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి ఉండాల్సిన బరువుకంటే 25 కిలోలు పెరిగితే దీన్ని తగ్గించుకోవడం ఒక సవాల్ అని బెంగళూరులోని లివ్‌లైఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయం, వైద్య చికిత్స చాలా అవసరమని తెలిపారు.
ఊబకాయం అనేది పట్టణాల్లోని ధనవంతులకే పరిమితమా? ఇది కూడా అపోహ మాత్రమే. భారతదేశంలోని మురికివాడల జనాభాలో 3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఎందుకంటే పౌష్టికాహార లోపం కూడా ఊబకాయానికి పెద్ద కారణం. ఊబకాయం వల్ల ఐరన్, విటమిన్ డి-3 లోపం వంటి సమస్యలొస్తాయి.
చిన్నపుడు లావుగా ఉండే పిల్లలు
లావుగా ఉన్న పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోతారా అంటే కాదు అంటున్నారు నిపుణులు. దాదాపు 80శాతం మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఊబకాయులుగా పెరుగుతారని ఢిల్లీలోని మాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్, మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ చౌబే వెల్లడించారు. అంతేకాదు వీరిలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బాల్యంలో వచ్చే స్థూలకాయంపై అప్రమత్తంగా ఉండాలని, మొదటినుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని, నియమాలను అలవాటు చేయాలని సూచించారు.
ఇన్‌ఫెర్టిలిటీ
సంతానలేమి ఊబకాయానికి కారణమవుతుంది. నిజానికి ఊబకాయం లేదా, అధిక బరువే ఇన్‌ఫెర్టిలిటీకి కారణం. యువతలో ప్రాథమిక వ్యంధత్వానికి అత్యంత సాధారణ కారణాలలో ఊబకాయం ఒకటని వైద్యనిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్
థైరాయిడ్ తక్కువగా ఉండటం వల్ల ఊబకాయం వస్తుంది. కాబట్టి థైరాయిడ్ మందులు తీసుకుంటే చాలు అనుకుంటే ఇది కూడా ఒక మిత్. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న అందరూ ఊబకాయంతో బాధపడరు. అలాగే, ఏ వ్యక్తిలోనైనా స్థూలకాయానికి ఏకైక కారణం హైపోథైరాయిడిజమ్‌గా చెప్పలేం. హార్మోన్ల సమస్యలు ఇందుకు కారణం. వైద్యుల సలహాలేకుండా థైరాయిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు దారితీయవచ్చు.
ఊబకాయం మనిషి శరీరాకృతిని ప్రభావితం చేయడం మాత్రమే కాదు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అతి తక్కువ కాలంలో బరువు బాగా పెరగడంతో మధుమేహం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అంతేకాదు తెలియకుండానే మూత్రపిండాల పనితీరును దెబ్బతిస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, వేళాపాళా లేకుండా భోజనం చేయడం, మద్యం, పొగతాగడం, ఒత్తిడి ఊబకాయానికి ముఖ్య కారణాలు. మారుతున్న జీవన శైలి, విచ్ఛలవిడిగా జంక్ ఫుడ్స్ వినియోగంతో బరువు పెరుగుతున్నారు. ప్రమాదాన్ని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య ఇంకా అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం, కనీస వ్యాయామం, అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment