గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట
● రూ.5లక్షల చొప్పున పరిహారం ● మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
నిర్మల్‌ఖిల్లా: రెక్కాడితే గాని డొక్కాడని దిగువ మధ్యతరగతి కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. అనుకోని ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో పలువురు అక్కడ మృతి చెందితే వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు నెలల తరబడి వేచి చూస్తున్న ఘటనలనేకం. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి మత్యువాత పడుతున్న వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గల్ఫ్ మృతుడి కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం ఇచ్చేందుకు గతంలోనే ఉత్తర్వులిచ్చింది. ఇటీవల నిధులు విడుదల చేసింది. నిర్మల్ జిల్లాకు రూ.25లక్షలు, మంచిర్యాల జిల్లాకు రూ.15లక్షల నిధులు మంజూరు చేసింది.
జిల్లాలో గల్ఫ్ గాయాలెన్నో..
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణాలతో పలువురు మృతి చెందగా బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. వారి కష్టాల గురించి ‘సాక్షి’లో ఎన్నో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జీవో 205 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్–2003 నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.5లక్షలు అందించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో దాదాపు 60 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నట్లు గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా, ఏటా పదుల సంఖ్యలో వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారు.
‘ప్రవాసీ ప్రజావాణి’లో వినతులు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీనిని నిర్వహిస్తున్నారు. దీనిని ప్రారంభించిన మొదటిరోజే జిల్లా నుంచి మృతుల కుటుంబసభ్యులు పలువురు వినతిపత్రాలు అందించారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో 205కు కొనసాగింపుగా, సాధారణ పరిపాలన శాఖలోని ప్రవాస భారతీయుల (జీఏడీ–ఎన్నారై) విభాగం పక్షాన ప్రవాసీ ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
ఎక్స్‌గ్రేషియా నిధుల విడుదల
2023 డిసెంబర్ 7నుంచి ఇప్పటివరకు గల్ఫ్‌దేశాల్లో 200 మందికి పైగా తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఈనెల 1న 113 కుటుంబాలకు రూ.5.65కోట్లు వివిధ జి ల్లాలకు విడుదల చేసింది. ఇందులో నిర్మల్ జిల్లాకు రూ.25లక్షలు, మంచిర్యాల జిల్లాకు రూ.15లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ఆదేశాల ద్వారా త్వరగా పరిహారాన్ని బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. గల్ఫ్ మృతుల సంఖ్య ప్రకారం అన్ని జిల్లాలకు విడతలవారీగా మరిన్ని నిధులు కేటాయించనున్నారు.
బాధిత కుటుంబాలకు భరోసా
ఉపాధి కోసం ఎడారి దేశాల బాట పడుతున్న కార్మికులెందరో విగత జీవులుగా స్వస్థలాలకు వస్తున్న దయనీయ దృశ్యాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తరచూ కనిపిస్తాయి. కొన్నిసార్లు మృతదేహాల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిస్తోంది. విడతల వారీగా జిల్లాలోని బాధిత కు టుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తోంది.
– స్వదేశ్ పరికిపండ్ల, రాష్ట్ర అధ్యక్షుడు,
ప్రవాసీమిత్ర కార్మికసంఘం
గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట
Comments
Please login to add a commentAdd a comment