● కలెక్టరేట్ ఎదుట బాధిత కుటుంబం నిరసన
నిర్మల్‌చైన్‌గేట్: భూ పోరాటం చేసి సాధించుకున్న భూమిలో నిర్మించుకున్న గుడిసెను అటవీ అధికారులు అక్రమంగా కూల్చారని ఓ కుటుంబం కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షకు దిగింది. ఖానాపూర్ మండలం రంగపేట్ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెంలో గోనె స్వామి, ఆయన కూతురు గోనె మల్లీశ్వరి భూపోరాటం ద్వారా 20 ఏళ్ల క్రితం ఆటవీ స్థలం ఆక్రమించుకున్నారు. అక్కడే గుడిసె వేసుకున్నారు. గ్రామపంచాయతీ ఇంటి నంబర్ కూడా మంజూరు చేసింది. 2005 నుంచి 2009 వరకు గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను చెల్లించారు. ఇక 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో కొంతమేర నిర్మాణం చేశారు. పంచాయతీ రోడ్డు సౌకర్యం కూడా కల్పించింది. ఇన్నేళ్ల తర్వాత అటవీ శాఖ గోనె స్వామి, ఆయన కూతురు మల్లీశ్వరికి అటవీ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని, తొలగించాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. రెండుసార్లు(జనవరి 16, ఫిబ్రవరి 12న)నోటీసులు ఇచ్చిన అటవీ అధికారులు, మార్చి 7న ఇంటిని కూల్చివేశారు. దీంతో తండ్రీ కూతురు నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి రోడ్డు పక్కన చెట్టు నీడన ఉంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గేటు ఎదుట సోమవారం దీక్ష చేపట్టారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కలెక్టరేట్ గేటు వదిలి వెళ్లబోమని తెలిపారు. ఈమేరకు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినట్లు వెల్లడించారు. స్పందించిన కలెక్టర్ డీఎఫ్‌వోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీరి దీక్షకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, జిల్లా నాయకులు సింగరి వెంకటేశ్, ఖానాపూర్ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గూట్ల ప్రసాద్, గోనె స్వామి, గోగు శేఖర్, రేగుల గంగన్న, మచ్చ కై లాస్, మాన్క శ్రీనివాస్, గోగు భూమక్క, గూట్ల రజిత, నైతం లింగు బాయి, సంఘీభావం తెలిపారు.


