భైంసాటౌన్: జిల్లా అధికారిక వెబ్‌సైట్ నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. జిల్లాకు సంబంధించి ఆయా శాఖలు, అధికారులు, ఉద్యోగుల వివరాలు, ఫోన్ నంబర్లతోపాటు ఇతర సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండాలి. కానీ, కొన్ని శాఖలకు సంబంధించి ఎలాంటి వివరాలు కనిపించడం లేదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. జిల్లాకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, వారి పేర్లు తెలుసుకోవడంతోపాటు సంబంధిత శాఖల సమాచారం కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే, కొన్ని శాఖల సమాచారం లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. తూనికలు, కొలతలు, కార్మిక, వ్యవసాయ, జీజీహెచ్, మత్స్య, అటవీ, వైద్యారోగ్య, మార్కెటింగ్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు సంబంధించి అధికారులు, ఇతర వివరాలు కనిపించడం లేదు. మరికొన్ని శాఖలకు సంబంధించి అధికారి మారినా.. పాత అఽధికారుల పేర్లే కనిపిస్తున్నాయి. ఐటీ వింగ్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.
కనిపించని కొన్నిశాఖల అధికారుల వివరాలు
మరికొందరు మారినా.. అవే పేర్లు
అధికారిక వెబ్‌సైట్ తీరిదీ!


