కోతలు షురూ.. కొనుగోళ్లు ఎప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

కోతలు షురూ.. కొనుగోళ్లు ఎప్పుడో..!

Apr 1 2025 10:03 AM | Updated on Apr 1 2025 1:24 PM

కోతలు షురూ.. కొనుగోళ్లు ఎప్పుడో..!

కోతలు షురూ.. కొనుగోళ్లు ఎప్పుడో..!

● ఇప్పటికే ఇంటికి చేరుతున్న పంట ఉత్పత్తులు ● కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ● రైతులకు తప్పని తిప్పలు

కుంటాల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న సమస్యలు తీరడం లేదు. మొక్కజొన్న, జొన్న వంటి పంటలను పండించినా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్య పట్ల ఉదాసీనంగా ఉండటం రైతులకు శాపంగా మారింది.

కల్లాల్లోనే ధాన్యం

మండలంలోని గ్రామాల్లో రైతులు 8,150 ఎకరాల్లో మొక్కజొన్న, 6,234 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. మొక్కజొన్న కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి, పంట ఉత్పత్తులు ఇంటికి చేరాయి. ఈ సీజన్‌లో గత ఏడాది కంటే జొన్న సాగు రెట్టింపు అయింది. 50 శాతం జొన్న పంట ఇంటికి చేరగా, మిగిలిన పంట నూర్పిడికి సిద్ధంగా ఉంది. మరో 15 రోజుల్లో జొన్న పంట కూడా ఇంటికి చేరనుంది. కానీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో పంట కల్లాల్లోనే మిగిలిపోతోంది.

కొనుగోలు ఏర్పాట్లలో జాప్యం..

రైతుల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డ‘ చందంగా తయారైంది. ఎంతో కష్టపడి పంటలు పండించినా, వాటిని అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కుంటాల పీఏసీఎస్‌ పరిధిలో గొల్లమాడ, ఓలా, లింబా(కె), అంబకంటి గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అలాగే కల్లూరు, కుంటాల, పెంచికల్‌పాడ్‌ గ్రామాల్లో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించగా, ఈ ఏడాది రూ.2,225గా నిర్ణయించారు, అంటే రూ.135 పెరిగింది. జొన్న క్వింటాల్‌కు గత ఏడాది రూ.3,180 ఇవ్వగా, ఈ సారి రూ.3,371గా నిర్ణయించారు, అంటే రూ.191 అదనంగా చెల్లిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన ప్రభుత్వం, జొన్న ధర మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉండటంతో రైతులు జొన్న సాగుపై ఆసక్తి చూపారు.

పరిమితి వద్దు..

గత ఏడాది ఎకరానికి 7 క్వింటాళ్ల జొన్న మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే, ఎక్కువ దిగుబడి రావడంతో రైతుల విజ్ఞప్తి మేరకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా 7 క్వింటాళ్ల పరిమితిని సడలించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం పంటను కల్లాల ఎదుట, రోడ్లపై ఆరబెడుతుండగా, కొందరు ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పంటను సకాలంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని వారు ఆశిస్తున్నారు.

త్వరలో కొనుగోళ్లు..

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జొన్న కొనుగోలు కేంద్రాలను అవసరమున్న చోట ఏర్పాటు చేస్తాం. త్వరలో కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌, డీఎం

అందాకూర్‌ లో జొన్నను ఆరబెట్టిన రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement