అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువమంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి కలెక్టర్లు, అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలి పారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రూ.50 వేలలోపు రుణం వంద శాతం మాఫీ, రూ.లక్ష లోపు రుణం 90 శాతం మాఫీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులోన్ల ద్వారా అందిస్తారని తెలిపారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందన్నారు. దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, మైనార్టీ అధికారి మోహన్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


