ఉపాధి కూలి సవరణ
● కనీస వేతనం రూ.7 పెంపు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఏప్రిల్ 1 నుంచి అమలు
నిర్మల్‌చైన్‌గేట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజీఎస్) కింద పనిచేసే కూలీలకు రోజువారీ వేతనంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, గతంతో పోలిస్తే రూ.7 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వేతనం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పని కల్పించే లక్ష్యంతో, కూలీలకు రూ.300 నుంచి రూ.307కి వేతనం పెంచారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనం రూ.300గా ఉండగా, ఈ సవరణతో జిల్లాలోని 1.89 లక్షల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ప్రారంభంలో 2006లో కనీస వేతనం రూ.87.50 మాత్రమే ఉండేది. కాలక్రమేణా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని వేతనాలను సవరిస్తున్నారు.
కూలీల అసంతృప్తి
సాధారణంగా ఏటా కూలీల వేతనాన్ని రూ.15 నుంచి రూ.25 వరకు పెంచుతూ వస్తున్నారు. 2024–25లో రూ.28 పెంచిన కేంద్రం, ఈసారి కేవలం రూ.7 మాత్రమే పెంచడం గమనార్హం. ఇది గత ఏడాది పెంపులో నాలుగో వంతు కంటే తక్కువ కావడంతో, కూలీలు పనుల పట్ల ఆసక్తి కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వేసవి భత్యం అనిశ్చితి
వేసవిలో ఎండల తీవ్రత మధ్య పనులకు హాజరయ్యే కూలీలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసవి భత్యం చెల్లించేవి. అయితే, గత ఏడాది ఈ భత్యం ప్రకటించకపోగా, ఈసారి కూడా ఎలాంటి ప్రకటన లేదు. దీంతో వేసవి భత్యం ఉంటుందా లేక తొలగించారా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయినప్పటికీ, కూలీలకు తాగునీరు సరఫరా కోసం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున నీటి సౌకర్యం కల్పించే బాధ్యత పంచాయతీలపై ఉంది.
పదేళ్లలో 62.86% పెరుగుదల
జిల్లాలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇ క్కడ 1.13 లక్షల జాబ్ కార్డులతో 1.89 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. పదేళ్ల క్రితం రోజువారీ వేతనం రూ.193 కాగా, ఇప్పుడు రూ.307కి చేరింది. అంటే 62.86% పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎక్కువ మంది కూలీలు పనుల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని పూర్తి చేసిన వారికి రూ.6 వేల ఆత్మీయ భరోసా అందించనుంది. ఈ పరిస్థితుల్లో పనులకు హాజరయ్యే వారి సంఖ్య ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సవరణలతో కూలీల జీవన ప్రమాణాలు కొంత మెరుగవుతాయని ఆశాభావం ఉన్నప్పటికీ, తక్కువ పెంపు వల్ల వారి ఉత్సాహంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఉపాధి కూలి సవరణ


