పోక్సో చట్టంపై అవగాహన ఉండాలి
● జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాధిక
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి రాధిక పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పంచశీల బీఈడీ కళాశాలలో పదోన్నతి పొందిన పీజీ హెచ్‌ఎం, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. బాలికలపై వేధింపులు జరగకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్ద, పాఠశాలలో, బడికి వచ్చే దారిలో, పొలం పనులకు వెళ్లినప్పుడు, పని ప్రదేశాలలో, బహిరంగ ప్రదేశాలలో విద్యార్థినులపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి తప్పించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. తల్లిదండ్రుల సమావేశాల్లో పోక్సో చట్టం, విద్యార్థినులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. సఖి కేంద్రం నిర్వహణ, సేవల గురించి నిర్వాహకురాలు శ్వేత వివరించారు. మహిళా ఉపాధ్యాయులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు నర్సయ్య, సలోమి కరుణ, ఎంఈవోలు రమణారెడ్డి, పరమేశ్వర్, ముత్యం తదితరులు పాల్గొన్నారు.


